May 27,2023 09:35
  • సమగ్రంగా అమలు కాని చట్టం
  • ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులు

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : వామపక్షాల కృషి, పోరాటం ఫలితంగా వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంపై తిరుపతి జిల్లాలో దళితులు అధికంగా ఆధారపడుతున్నారు. ఆ తర్వాత స్థానంలో గిరిజనులు ఉన్నారు. ఉపాధి పనులకు వెళ్తున్న వారిలో మహిళలే అధికం. ఇతర పనులు దొరక్కపోవడంతో వీరందరికీ ఉపాధి పనులే దిక్కవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధి చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి మరింత మందికి పనులు కల్పించాల్సి ఉంది. దీనికి భిన్నంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉపాధి చట్టానికి తూట్లు పొడుస్తున్నాయి. జాబ్‌ కార్డుదారులకు ముఖ్యంగా దళితుల, మహిళల పొట్టగొట్టాలని చూస్తున్నాయి. వేతనం గిట్టుబాటు కావడం లేదు. పని ప్రదేశంలో చట్టం ప్రకారం కల్పించాల్సిన ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం లేదు. రైతుల పొలాల్లోకి పనికి వెళ్తే ఉదయం సద్దెన్నం, మధ్యాహ్నం భోజనం పెట్టి రూ.500 ఇస్తున్నారని, ఉపాధి పనులకు వెళితే సొంత పనిముట్లు, ఆటో ఛార్జి, నీళ్ల బాటిల్‌, మజ్జిగ ప్యాకెట్లు తీసుకుని తామే తీసుకెళ్లాల్సి వస్తోందని, రెండు పూటలా పనిచేసినా ఖర్చులుపోగా రోజుకు రూ.200 కూడా మిగలడం లేదని పలువురు ఉపాధి కార్మికులు 'ప్రజాశక్తి'కి తెలిపారు. రామచంద్రాపురం మండలం రామాపురం పంచాయతీలో 2,100 మందికి జాబ్‌కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న చెరువు, వంక, అడవులకు ట్రెంచింగ్‌ పనులు 150 మంది చేస్తున్నారు. వారిలో వంద మంది దళితులు ఉన్నారు.

                                                                దళితులే ఎక్కువగా పనికొస్తున్నారు

తిరుపతి జిల్లాలో ఉపాధి పనులకు వస్తున్న వారిలో ఎస్‌సిలు, ఎస్‌టిలు 75 నుంచి 80 శాతం మంది ఉన్నారు. వీరిలో మహిళలే ఎక్కువమంది. జిల్లా వ్యాప్తంగా 2.76 లక్షల మంది జాబ్‌కార్డుదారులు ఉన్నారు. వీరిలో ఎస్‌సిలు 1.01 లక్షల మంది, ఎస్‌టిలు 26,600 మంది ఉన్నారు. గతేడాది 1.05 లక్షల మంది జాబ్‌కార్డుదారులు పనులకు వచ్చారు. ఈ ఏడాది 95 వేల మంది మాత్రమే వస్తున్నారు. వారిలో దళిత మహిళలే అధికంగా ఉన్నారు.           - శ్రీనివాసప్రసాద్‌, జిల్లా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌

1122

                                                               

                                                                ఆటో ఖర్చులూ మావే

రామచంద్రాపురం మండలంలోని ఎస్‌టి కాలనీ వెనకాల అడవిలో అమృత సరోవరం ఛానల్‌ పనులు జరుగుతున్నాయి. అక్కడకు వెళ్లాలంటే ఆటో తప్ప మరో మార్గం లేదు. ఆటోకి ఒక్కొక్కరం రూ.40 రానుపోను ఇచ్చి పనులకు వెళ్లి వస్తున్నాం. రోజంతా పనిచేస్తే రూ.250 మించి వేతనం రావడం లేదు. అందులో ఆటో ఛార్జి, నీళ్ల బాటిల్‌, మజ్జిగ ప్యాకెట్లు ఖర్చుపోగా మిగిలేది 180 రూపాయలే. అదే రైతు పొలాల్లో పనులకు వెళితే మధ్యాహ్నానికి రూ.500 ఇస్తారు.
                              - సి.చెంగయ్య, రామాపురం

2233


                                                                   రోజుకు రూ.600 ఇవ్వాలి

మా ఊరు తిరుపతి సమీపంలో ఉండడం వల్ల పొలాలన్నీ ప్లాట్లుగా మారిపోయాయి. పొలం పనులు లేకుండా పోయాయి. ఉపాధి హామీ పనులే మాకు దిక్కవుతున్నాయి. ఇచ్చే కూలి ఏ మాత్రమూ గిట్టుబాటు కావడం లేదు. అన్ని సౌకర్యాలూ కల్పిస్తూ రోజుకు రూ.600 ఇవ్వాలి. 50 మంది పనిచేస్తుంటే అందులో 40 మంది రామాపురం దళితవాడ నుంచే వస్తున్నాం. ఇందులో 30 మంది మహిళలే.
                                                                                                              - చెంగమ్మ, రామాపురం