Oct 14,2023 09:16

బిజెపి, వైసిపి ప్రభుత్వాలు విద్యారంగానికి తీవ్ర ద్రోహం చేశాయి
సిపిఎం రాష్ట్ర స్థాయి విద్యారంగ సదస్సులో ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు
ప్రజాశక్తి- ఒంగోలు కలెక్టరేట్‌:కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వాలు విద్యారంగానికి తీరని ద్రోహం చేశాయని, మేధావులకు కేంద్రాలుగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు వైసిపి హయాంలో రాజకీయ పార్టీ కార్యాలయాలుగా మారాయని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు పేర్కొన్నారు. 'నేటి విద్యా రంగం-ప్రత్యామ్నాయ విధానాలు' అనే అంశంపై సిపిఎం ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలులోని అంబేద్కర్‌ భవన్‌లో శుక్రవారం జరిగిన రాష్ట్ర స్థాయిలో ఆయన ముఖ్యవక్తగా పాల్గని ప్రసంగించారు. విశ్వవిద్యాలయాల అభివృద్ధిని పాలకులు గాలికి వదిలేశారని విమర్శించారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయడం లేదని, వివిధ కోర్సులను ఎత్తివేస్తున్నారని వివరించారు. ప్రయివేటు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వ అజమాయిషీ తగ్గడంతో ఆ యూనివర్సిటీలు విద్యను వ్యాపారంగా మార్చేశాయని విమర్శించారు. అన్ని విద్యాసంస్థల్లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. విద్యా దీవెన, వసతి దీవెన ఫీజులు సకాలంలో రాక విద్యార్థులు ఫీజులు భారం మోయాల్సి వస్తోందన్నారు.
మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ ఉన్నత విద్యలో కోర్సుల మూసివేతతో ప్రభుత్వ విద్య పేదవారికి దూరమవుతోందని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ప్రతి నియోజకవర్గంలో ఒకటి ఏర్పాటు చేయాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో అనుసరిస్తోన్న విద్యా విధానం దేశానికి గర్వకారణంగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్త, మంగమ్మ కాలేజీ రిటైడ్‌ ప్రిన్సిపల్‌ ఎవి పుల్లారావు, రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌ పేరయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జివి కొండారెడ్డి, సిపిఎం రాష్ట్ర నాయకులు కెప్రసన్నకుమార్‌, ఎ అశోక్‌ మాట్లాడారు. సదస్సుకు పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాలు ఆంజనేయులు అధ్యక్షత వహించారు.
పలు తీర్మానాలు ఆమోదం
రాష్ట్ర స్థాయి విద్యారంగ సదస్సులో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జివి.కొండారెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాలను ప్రతినిధులంతా ఆమోదించారు.
- కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య ప్రభుత్వమే అందించాలి.
- కేంద్రం తీసుకొచ్చిన కొత్త విద్యా విధానం రద్దు చేసి తక్షణం 3, 4, 5 తరగతుల విలీనం ఆపాలి
- ఉన్నత విద్యలో సామాజిక అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలి.
- యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడి నిధులు కేటాయించాలి. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలి.
- ప్రభుత్వ బడులను అభివృద్ధి చేయాలి. కార్పొరేట్‌ విద్యాసంస్థలపై ప్రభుత్వ జోక్యం పెరగాలి. ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి.
- బడ్జెట్‌ విద్యా సంస్థలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి.
- హాస్టల్‌ విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌ ఛార్జీలు పెంచాలి. సొంత భవనాలు నిర్మించి ట్యూటర్లను నియమించాలి.
- రద్దు చేసిన ఎయిడెడ్‌ విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించాలి.
- జిఒ నెంబర్‌ 77 రద్దు చేసి పిజి విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కల్పించాలి.
- ఆంధ్ర కేసరి యూనివర్సిటీకి నిధులు కేటాయించి నిర్మాణం చేపట్టాలి.
- విద్యలో కేరళ వామపక్ష ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచింది. విద్యలో 94 శాతం అక్షరాస్యత సాధిస్తూ అగ్రభాగాన నిలిచింది. కేరళ తరహా విద్యావిధానం మన రాష్ట్రంలో అమలు చేయాలి.