చెన్నై : మనీలాండరింగ్ కేసులో తమిళనాడు విద్యాశాఖామంత్రి వి. సెంథిల్ బాలాజీని బుధవారం తెల్లవారుజామున ఇడి అరెస్టు చేసింది. ఈ అరెస్టును డిఎంకె ఎంపి, న్యాయవాది అయిన ఎన్‌ఆర్ ఎలాంగో, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్రంగా ఖండించారు. దర్యాప్తు సంస్థ ఇడి రాజ్యంగ విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా మంగళవారం అర్థరాత్రి కస్టడీలోకి తీసుకుందని ఎలాంగో విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఎలాంటి సమాచారం తెలపకుండానే ఇడి అధికారులు బాలాజీని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై న్యాయపరంగా పోరాడతాం' అని ఆయన అన్నారు. ఇక బాలాజీ అరెస్టును టిఎంసి ఎంపీ సౌగతా రారు తీవ్రంగా ఖండించారు. 'ఇడిని ఎలా దుర్వినియోగం చేస్తారు? అది పూర్తిగా తప్పు' అని రారు ఆరోపించారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బాలాజీ అరెస్టును 'ప్రతీకార రాజకీయం'గా అభివర్ణించారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇడి అరెస్టుకు వ్యతిరేకంగా ఓ ప్రకటనను విడుదల చేసింది. 'ఇది మోడీ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ వేధింపులు... ప్రతీకార చర్యలు తప్ప మరొకటి కాదు. ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి దుందుడుకు చర్యలకు భయపడబోవని' అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ఇడి విచారణలో బాలాజీకి ఛాతీ నొప్పి రావడంతో చెన్నైలోని ఒమందూరర్ ప్రభుత్వ ఆసుపత్రికి ఇడి అధికారులు తరలించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆసుపత్రికి వెళ్లి బాలాజీని పరామర్శించారు.










