Sep 14,2023 22:12

- 29న బహిరంగ సభ
ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం సిపిఎం ఆధ్వర్యాన ఈ నెల 20 నుంచి 29వ తేదీ వరకూ ఉక్కు రక్షణ బైకు యాత్ర జరుగనుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం తెలిపారు. విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం నుంచి మొదలై ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల్లో సుమారు 1200 కిలో మీటర్లు సాగే ఈ బైకు యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆయన గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లోకనాథం మీడియాతో మాట్లాడుతూ.. ఈ యాత్ర ఉత్తరాంధ్ర అంతటా సాగి 29న కూర్మన్నపాలెంలో స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు చేపట్టిన నిరాహార దీక్ష శిబిరం వద్ద ముగుస్తుందని, ఆ రోజు సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని తెలిపారు. బైకు యాత్ర ప్రారంభానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హాజరవుతారన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. రాష్ట్రానికి ఉన్న ఏకైక భారీ పరిశ్రమ, ఉత్తరాంధ్రలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ విశాఖపట్నం స్టీల్‌ప్లాంటేనని గుర్తు చేశారు. దీనిని అమ్మేయాలని మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరాంధ్ర ప్రజలు సహించబోరన్నారు. 945 రోజులుగా ఉక్కు పరిరక్షణ కోసం ఆందోళనలు కొనసాగుతున్నా మోడీ సర్కారు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన వైసిపి, టిడిపి, జనసేనలు అవకాశవాదంతో వ్యవహరిస్తున్నాయని తెలిపారు. అధికార వైసిపి మొక్కుబడిగా అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులిపేసుకుందన్నారు. ప్రతిపక్ష టిడిపికి వైసిపిని విమర్శించడమే తప్ప బిజెపి ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడం లేదన్నారు. ఇక ప్రశ్నిస్తానని బయలుదేరిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న మోడీ ప్రభుత్వ పంచన చేరాడని విమర్శించారు. ఇదే అవకాశంగా బిజెపి సర్కారు ప్లాంట్‌ను నిర్వీర్యం చేస్తోందన్నారు. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించడం లేదని, ఉత్పత్తికి అవరోధాలు సృష్టిస్తోందని, ప్లాంట్‌లో ఉద్యోగ ఖాళీలను నింపడం లేదని తెలిపారు. తాము చేపట్టే బైకు యాత్ర ప్రజల్లో చైతన్యం నింపుతుందన్నారు. పోస్టర్‌ ఆవిష్కరణలో సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు పాల్గొన్నారు.