ప్రజాశక్తి-బొబ్బిలి : విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో ఉన్న ఎస్‌ఆర్ పెట్రోల్ బంకులోని ట్యాంకును శుభ్రం చేసేందుకు దిగిన కార్మికుడు ఊపిరి ఆడక మృత్యువాత పడడంతో అతన్ని రక్షించబోయి లారీ హెల్పర్ కూడా మరణించాడు. పోలీసుల వివరాల మేరకు.. ట్యాంకును శుభ్రం చేసేందుకు బొబ్బిలి మండలంలోని చింతాడ గ్రామానికి చెందిన పెద్దింటి పొలినాయుడు (55) లోపలకు దిగాడు. విషవాయువుతో ఊపిరి అందకపోవడంతో ట్యాంకులోనే మృతి చెందారు. పొలినాయుడును కాపాడేందుకు అక్కడే ఉన్న లారీ హెల్పర్ అనూష్ (27) ట్యాంకులోకి దిగడంతో అతను కూడా మృతి చెందారు. కొన్ని నెలల నుంచి పెట్రోల్ బంకు మూతపడి ఉంది. తిరిగి తెరిచేందుకు యజమాని నిర్ణయించడంతో ట్యాంకులను శుభ్రం చేయించే క్రమంలో ఈ దారుణం చోటు చేసుకుంది. బీహార్ రాష్ట్రం పాట్నాకు చెందిన అనూష్ లారీ హెల్పర్‌గా పని చేస్తున్నాడు. మరమ్మతులకు గురై పెట్రోల్ బంకు వద్ద పది రోజుల క్రితం లారీ ఆగిపోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.










