హైదరాబాద్ : హైదరాబాద్‌లో నిషేధిత పారిస్ సిగరెట్లను విక్రయిస్తున్న ఒకరిని, అందుకు సహకరిస్తున్న మరొకరిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మంగళ్‌హట్ సీతారాంపేట్‌లోని ప్రగతి ట్రాన్స్‌పోర్టు కార్యాలయంపై మంగళవారం పోలీసులు దాడులు చేసి రూ. 8లక్షల విలువగల నిషేధిత సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.బేగంబజార్‌కు చెందిన విపుల్ రంకా, ప్రగతి ట్రాన్స్‌పోర్ట్ మేనేజర్ దీపక్ జాదవ్ అనే వ్యక్తులు గతంలో కోప్టా చట్ట నిందితులని పోలీసులు పేర్కొన్నారు. నిషేధించిన సిగరెట్లను ఢిల్లీలో తక్కువ ధరకు కొనుగోలు చేసి దొంగచాటున హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారని చెప్పారు. ట్రాన్స్‌పోర్టును అడ్డాగా చేసుకుని రవాణాను, విక్రయ దందాను నడుపుతున్నారని హైదరాబాద్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాధా కిషన్‌రావు వెల్లడించారు.సిగరెట్లపై హెచ్చరిక ముద్రణలు లేకుండా, ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లించకుండా , కస్టమ్ డ్యూటీ చెల్లించకుండా రవాణా చేస్తూ హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారని ఆయన వివరించారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడంతో పాటు వినియోగదారులకు ఆరోగ్యానికి హాని కలిగించే యత్నానికి పాల్పడుతున్నారని వెల్లడించారు.










