విజయవాడ రూరల్ (ఎన్‌టిఆర్) : ఉపాధి కూలీలకి రెండు పూటలా పనిని ఆపాలని వ్య.కా.సంఘం డిమాండ్ చేసింది. సోమవారం ఉదయం విజయవాడ రూరల్ మండలం నున్నా గ్రామం చెరువు వద్ద జరుగుతున్న ఉపాధి పనులను వ్యవసాయ కార్మిక సంఘం నేతలు పరిశీలించారు. కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్ మాట్లాడుతూ ... మోడి ఉపాధి హామీకి తగ్గించిన బడ్జెట్లో రూ.30 వేల కోట్లు పెంచాలని, రోజుకి కూలీని చట్ట ప్రకారం ఇవ్వాలని, రెండు పూటలాపని నిలుపుదల చేసి, ఒక పూట మాత్రమే పని చేపట్టాలని, 200 రోజులు పనిదినాలు కల్పించాలని, టెంటులు, మజ్జిగ, మంచినీరు సౌకర్యం కల్పించాలని, గతంలో ఇచ్చినట్లుగానే తగిన పనిముట్లు ఇవ్వాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి ఈ చట్టం అమలుకి బడ్జెట్ పెంపుకి కేంద్రంతో పోరాడాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుపరచాలని కోరారు. లేకపోతే ఉపాధి కూలీల సమస్యలు పరిష్కారం కోసం ఆందోళన ఉదఅతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సంఘం నాయకులు చిన వెంకటరెడ్డి, ప్రజానాట్యమండలి నాయకులు రంగారెడ్డి మేట్లు, కూలీలు, తదితరులు పాల్గొన్నారు.










