- ఇళ్ల స్థలాల పేరుతో నగరానికి దూరంగా తరలించి నయా మురికివాడలు సృష్టించొద్దు
- విజయవాడ సెంట్రల్ 'సిపిఎం ప్రజాపోరు పాదయాత్ర' ప్రారంభోత్సవంలో వి శ్రీనివాసరావు
ప్రజాశక్తి- విజయవాడ : పేదలకు వారు నివాసముంటున్న చోటే పట్టాలివ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల పేరుతో వారిని నగరానికి దూరంగా తరలించి నయా మురికివాడలను సృష్టించాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. ధనికులను నగరాల్లో, పట్టణాల్లో ఉంచి పేదలకు ఊళ్లకు దూరంగా పంపడం పేదల పట్ల వివక్ష చూపడమేనన్నారు. విజయవాడ సింగ్‌నగర్ డాబాకొట్లు సెంటరులో శనివారం సెంట్రల్ నియోజకవర్గ స్థాయి 'సిపిఎం ప్రజాపోరు పాదయాత్ర' ప్రారంభమైంది. ఈ యాత్రను కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానుల నడుమ అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో వి.శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి బి.రమణారావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఇళ్ల స్థలాల పేరుతో భూ కుంభకోణాలకు పాల్పడడం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడం తప్ప అబివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టిలేకుండా పోయిందని విమర్శించారు. దశాబ్దాల తరబడి పేదలు నివాసం ఉంటున్న గృహాలకు పట్టాలివ్వకుండా, అందుబాటులో ఉన్న స్థలాలను పేదలకు పంపిణీ చేయకుండా, ఎక్కడో నగరానికి సుదూరంగా, పేదలను వెలివేసినట్లు వివాదాస్పద భూముల్లో స్థలాలిచ్చినా ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. పేదలు నివాసం ఉంటున్న ఇళ్లకే రిజిస్ట్రేషన్‌తో కూడిన పట్టాలను పంపిణీ చేయాలని, ఏళ్ల తరబడి పంపిణీకి నోచుకోని టిడ్కో గృహాలను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధాని సమీపంలోని విజయవాడ ప్రాంతంలో అవుటర్, ఇన్నర్ రింగ్ రోడ్లంటూ గొప్పలు చెప్పుకోవడం మినహా నగరంలో ప్రధాన, అంతర్గత రహదారులను, వంతెనలను, డ్రెయినేజీలను అభివృద్ధి చేయడంగానీ, కొత్తవి నిర్మించడంగానీ చేయలేదని విమర్శించారు. నగరంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది వామపక్షాల పాలనలోనేనని గుర్తు చేశారు. కొండలపై నివసించే వారికి బూస్టర్ల ద్వారా నీటి సరఫరా చేయడం, విద్యుత్, రహదారులు, వంతెనలు తదితర అనేక రూపాల్లో విజయవాడ అభివృద్ధి జరిగిందన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పాలకులు నగరానికి ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. ఈ పాదయాత్రకు నేతృత్వం వహిస్తోన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడిగా ఉన్న సెంట్రల్ ఎంఎల్‌ఎ మల్లాది విష్ణు విజయవాడ నగరాభివృద్ధికి ప్రణాళికలు వేయలేదుగానీ అవినీతి, అక్రమాలకు మాత్రం ప్రణాళికలు రచించారని విమర్శించారు. గుణదల ప్లైఓవర్, సింగ్‌నగర్ రెండో ప్లైఓవర్, వంతెనలు, ఆర్‌యుబిలు, డ్రెయినేజి తదితర సమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. తొలి రోజు 58, 61 డివిజన్లలో పాదయాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.












