Sep 23,2023 10:54
  • రాష్ట్రాభివృద్ధికి బిజెపి అడ్డంకి
  • 20 నుంచి 25 అసెంబ్లీ, 3 నుంచి 4 పార్లమెంట్‌ స్థానాలకు పోటీ

ప్రజాశక్తి - మంగళగిరి (గుంటూరు) : విద్యుత్‌ సర్దుబాటు పేరుతో ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారం, ప్రజా ఉద్యమాలపై నిర్భంధాన్ని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో 27న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాల వద్ద చేపట్టనున్న ధర్నాలు, ఆందోళనలను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. గుంటూరు జిల్లా మంగళగిరి రత్నాల చెరువులో సిపిఎం విస్తృత సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు.విద్యుత్‌ ఛార్జీలు తగ్గిస్తామని గత ఎన్నికల ముందు వైసిపి హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం వచ్చాక గత నాలుగు సంవత్సరాలుగా టారిఫ్‌ పెంపు, స్లాబుల మార్పిడి, ట్రూఅప్‌ ఛార్జీలు, విద్యుత్‌ సుంకం, సర్‌ ఛార్జీల ఇలా పలు రూపాల్లో ప్రజలపై రూ. వేలకోట్ల భారం మోపారని తెలిపారు. అదాని కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇది అంతా చేస్తోందని విమర్శించారు. టెక్నాలజీ పెరిగిన తరుణంలో యూనిట్‌ విద్యుత్‌ రూపాయికి అందించవచ్చని తెలిపారు. విద్యుత్‌ సమస్యలపై పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలని కోరారు. మరోవైపు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా నిర్బంధం పెరిగిందని, సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేయాలన్నా కోర్టు పర్మిషన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అసెంబ్లీ జరుగుతున్నందున 25న అంగన్‌వాడీ ధర్నాకు అనుమతి ఇవ్వలేమని కోర్టు చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. పార్లమెంటు జరిగే సమయంలో ఢిల్లీలో అనేక ఆందోళనలు చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు బిజెపితో అంటకాగుతూ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందకపోవడానికి బిజెపినే కారణమన్నారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని బిల్లులకు వైసిపి, టిడిపి మద్దతు తెలుపుతున్నాయని తెలిపారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన బిజెపి పట్ల వారి వైఖరి తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్రంగా ఎదగడానికి సిపిఎం కృషి చేస్తోందని అన్నారు. 20 నుండి 25 వరకు అసెంబ్లీ స్థానాలకు, మూడు లేదా నాలుగు పార్లమెంట్‌ స్థానాలకు పోటీ చేస్తామని తెలిపారు. ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తామని అన్నారు. వైసిపి టిడిపిలు రాష్ట్ర ప్రయోజనాల కోసం బిజెపిని విడిచి, రాష్ట్రాభివృద్ధి కొరకు పాటుపడాలని కోరారు.