Jun 02,2023 10:06
  • నిబంధనల ముసుగులో ఇష్టారాజ్యం
  • పరిపాలనా అవసరాల పేరిట అడ్డగోలు బదిలీలు
  • పెద్ద ఎత్తున సొమ్ము చేతులు మారినట్లు ఆరోపణలు
  • బదిలీలపై సమాచారం ఇచ్చేందుకు అధికారుల వెనుకంజ
  • శాఖల వారీగా బదిలీల జాబితా బయటపెడితేనే వాస్తవాలు వెలుగులోకి

ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి : ఏలూరు జిల్లాలో బదిలీల ప్రక్రియ ఓ మాయాజాలంలా మారింది. నిబంధనల ముసుగులో తమకు నచ్చినవారికి నచ్చినచోట పోస్టింగులు ఇస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బదిలీల సమాచారం ఇచ్చేందుకు అధికారులు వెనుకంజ వేస్తున్న తీరు సైతం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ బదిలీలలకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేచోట ఐదేళ్ల కాలం పూర్తి చేసుకున్న ఉద్యోగులకు బదిలీ తప్పనిసరని, ఈ ఏడాది ఏప్రిల్‌ 30 నాటికి ఒకేచోట రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు రిక్వెస్ట్‌ ప్రాతిపదికన బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొంది. అదే సమయంలో మరో అంశాన్ని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. అడ్మినిస్ట్రేటివ్‌ గ్రౌండ్స్‌లో భాగంగా పని చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారులను బదిలీ చేసే అవకాశాన్ని ఇచ్చింది. అడ్మినిస్ట్రేటివ్‌ గ్రౌండ్స్‌లో భాగంగా అనే అంశాన్ని పలు శాఖల్లో అధికారులు తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నారని, బదిలీల ప్రక్రియను ఇష్టానుసారంగా మార్చేశారని తెలుస్తోంది. ఒకేచోట రెండేళ్లు పూర్తికాని ఉద్యోగులను అడ్మినిస్ట్రేటివ్‌ అంశం అంటూ బదిలీల జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. అడ్మినిస్ట్రేటివ్‌ అనే అంశం వర్తించాలంటే సదరు అధికారి పని చేయకుండా, రిమార్కు ఉంటేనే వర్తిస్తుందని చెబుతున్నారు. అదీ పెద్ద కేడర్‌లో ఉన్న అధికారులకే ఇది వర్తించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. బదిలీల ప్రక్రియలో అవన్నీ పక్కనపెట్టి అడ్మినిస్ట్రేటివ్‌ గ్రౌండ్స్‌ ప్రాతిపదికన అంటూ ఇష్టానుసారంగా బదిలీలు చేసినట్లు తెలుస్తోంది. రెవెన్యూ, పంచాయతీరాజ్‌ ఇలా బదిలీల ప్రక్రియ జరిగిన అన్ని శాఖల్లోనూ ఈ తంతు నడిచినట్లు చెబుతున్నారు. ఈ ప్రక్రియలో పెద్దఎత్తున మామూళ్లు చేతులు మారినట్లు ప్రచారం సాగుతోంది. తమకు నచ్చిన అధికారులను నచ్చిన చోటుకు బదిలీ చేసినట్లు చెబుతున్నారు. బదిలీల తంతుపై ఉద్యోగుల్లో తీవ్రమైన చర్చ సాగుతోంది. ఎంఎల్‌ఎలు, మంత్రుల సిఫార్సు లేఖలు ఉంటే చాలు నిబంధనలతో సంబంధం లేకుండా ఏదోకటి పేర్కొంటూ బదిలీ చేసేసినట్లు సమాచారం.
 

                                                           బదిలీల జాబితాను బయట పెడతారా..?

ఉద్యోగులు బదిలీల ప్రక్రియ పూర్తయినట్లుగా అధికారులు చెబుతున్నారు. పలు శాఖలకు సంబంధించి పోస్టింగులు ఇచ్చేయడం, ఉద్యోగులు చేరిపోవగడం కూడా జరిగిపోతుంది. అయితే ఏ శాఖలో ఎంతమంది బదిలీ అయ్యారు. బదిలీ అయిన ఉద్యోగులకు సంబంధించిన జాబితాను మాత్రం అధికారులు బయటపెట్టడం లేదు. గతంలో ఎంపిడిఒ, తహశీల్దార్ల బదిలీలతో పాటు అన్నిశాఖలకు సంబంధించిన బదిలీల జాబితాలను మీడియాకు ఇచ్చేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా పోయింది. బదిలీల ప్రక్రియ అంతా గోప్యంగా సాగుతున్న పరిస్థితి నెలకొంది. జాబితా బయటపెడితే బదిలీల్లో డొల్లతనం బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అడ్మినిస్ట్రేటివ్‌ గ్రౌండ్స్‌లో భాగంగా బదిలీ చేస్తే అందుకు సంబంధించిన రిమార్కులు రాయాల్సి ఉంటుంది. అలాంటి అధికారులు ఎంతమందిని బదిలీ చేశారో వివరాలు బయటపెడితే బదిలీలో పారదర్శకత ఎంతో తేలనుంది. రెండేళ్లు సర్వీసు పూర్తికాని ఉద్యోగులంతా రాజకీయ, అధికారుల పలుకుబడి ఉపయోగించుకుని నచ్చినస్థానానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా బదిలీల ప్రక్రియకు సంబంధించిన జాబితాను శాఖల వారిగా బయటపెట్టాలని అంతా కోరుతున్నారు.