- ఊహించని విపత్తుతో కుదేలైన విలీన మండలాలు
- కట్టుబట్టలతో మిగిలిన వేల కుటుంబాలు
- చెత్త, కళేబరాలతో జనావాసాలలో తీవ్ర దుర్గంధం
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : గోదావరి వరద ఉధృతికి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలైన విఆర్.పురం, కూనవరం, ఎటపాక, చింతూరుల్లో ప్రజలు ఊహించని విపత్తును చవిచూశారు. ఈ మండలాల్లో సుమారు రూ.200 కోట్లకుపైగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. మండల కేంద్రాల్లోనూ ఈ నెల రెండో వారంలో కేవలం 24 గంటల వ్యవధిలో 30 అడుగుల ఎత్తులో నీరు ప్రవహించింది. వదర సమయంలో ఇళ్లలోని వస్తువులను వదిలేసి ప్రజలు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. అధికారులు విఆర్ పురంలో 26 వేలు, కూనవరంలో 28 వేలు, ఎటపాకలో 4500, చింతూరులో నాలుగు వేల కుటుంబాలు ముంపునకు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. అయితే, మొత్తం 75 వేలు కుటుంబాలు ముంపునకు గురైనట్లు తెలుస్తోంది. ఒక్కొక్క కుటుంబం కనిష్టంగా రూ.2 లక్షల నుంచి గరిష్టంగా రూ.4 లక్షల వరకూ నష్టం వాటిల్లినట్లు బాధితులు చెప్తున్నారు. ఈ లెక్కన రూ.150 కోట్లకు నష్టం జరిగినట్లు తెలుస్తోంది. వ్యాపార సముదాయాల్లో సరుకులు పూర్తిగా పాడవడంతో మరో రూ.50 కోట్లు నష్టపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇంత పెద్దఎత్తున విపత్తు జరిగితే ప్రభుత్వం బియ్యం, కూరగాయలు, రూ.2,000 నగదు ఇచ్చి చేతులు దులుపుకోవడం పట్ల బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గృహోపకరణాలు పూర్తిగా ధ్వంసం
ప్రతి ఇంట్లో గృహోపకరణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వంట సామగ్రిని తిరిగి వినియోగించే పరిస్థితి లేదు. బురద నీటితో జంతు కళేబరాలు రావడంతో గ్రామాల్లో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. కూనవరం, చింతూరులలో మొదటి అంతస్తు పైవరకూ నీరు నిలిచిపోవడంతో ఇంటిలోని దుస్తులు, సామగ్రికి పూర్తిగా బురదమయం అయ్యాయి. వారం రోజుల పాటు టెలివిజన్లు, ఫ్యాన్లు, వాషింగ్ మెషిన్లు తదితర విద్యుత్తు గృహోపకరణాలు బురద నీటిలో ఉండడంతో అవి తిరిగి వినియోగంలోకి వచ్చే పరిస్థితి లేదు. ప్రధాన వీధుల్లోనూ రెండు నుంచి మూడు అడుగుల మేర బురద చేరింది. దీన్ని పారిశుధ్య సిబ్బంది దశల వారీగా తరలిస్తున్నారు. కొన్ని ఇళ్లకు వెళ్లేందుకు ఇప్పటికీ దారులు అందుబాటులో లేవు. ఇళ్లు, షాపుల విద్యుత్తు మీటర్లు, ఇళ్ల వైరింగ్ కూడా రోజుల తరబడి వరద నీటిలో ఉండడంతో మరమ్మతులు తప్పనిసరి అవుతున్నాయి.
పూరిళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. రేకుల షెడ్లు కొట్టుకుపోయాయి. కొన్ని ఇళ్లకు గోడలే మిగిలాయి. పక్కా ఇళ్లకు సైతం బీటలు రావడంతో మరమ్మతు చేయించక తప్పదని బాధితులు వాపోతున్నారు. ఈ పనుల నిమిత్తం ప్రతి కుటుంబంపైనా రూ.2 లక్షల భారం పడనుంది. దెబ్బతిన్న ఇళ్లకు రూ.లక్ష వెచ్చించాల్సి వస్తుంది. ఫ్యాన్సీ, పచారీ, దుస్తులు, ఎరువుల దుకాణాలు అన్నీ నీట మునగడంతో వ్యాపారులకు కనిష్టంగా రూ.3 లక్షలు మొదలుకొని గరిష్టంగా రూ.10 లక్షల వరకూ నష్టం వాటిల్లింది. ప్రస్తుతం ఇళ్లల్లోనూ, షాపుల్లోనూ బురదను మోటార్లు ద్వారా నీటిని వదిలి శుభ్రం చేసుకుంటున్నారు. దీనికోసం కనిష్టంగా రూ.15 వేలు నుంచి గరిష్టంగా రూ.30 వేలు వరకూ ఖర్చు అవుతోంది. నగదు చెల్లించలేని కుటుంబాలు స్వయంగా శుభ్రం చేసుకుంటున్నాయి.
నష్టాన్ని చూసి తట్టుకోలేక ముగ్గురు వృద్ధుల మృతి
కూనవరం మెయిన్ రోడ్డు, టేకుల బోరులో అనేక కుటుంబాలు వారం రోజుల పాటు మేడలపై చేరి తలదాచుకున్నాయి. మొదటి అంతస్తులోకి నీరు చేరడంతో మరో భవనంపైకి వెళ్లి తలదాచుకున్నట్లు కె.నాగమణి తెలిపారు. సుమారు వారం రోజుల పాటు భవనాలపైనే గడిపామని, తాగేందుకు వర్షపు నీరే దిక్కయిందని ఆనాటి దుస్థితిని వివరించారు. విఆర్.పురం మండలంలో తలదాచుకున్న వడ్డిగూడెం వాసులదీ ఇదే పరిస్థితి. కట్టబట్టలే మిగిలాయి. ఈ ప్రాంతంలోని ప్రభుత్వ భవనంలో తలదాచుకున్న వృద్ధుల్లో ముగ్గురు మనస్తాపంతో మృతి చెందడం ప్రభుత్వ వైఫల్యానికి దర్పణం పడుతోందని వారి కుటుంబసభ్యులు పేర్కొన్నారు. వి.ఆర్.పురం, రాజుపేట, రేఖపల్లి ప్రభుత్వాస్పత్రి, పెద్దమట్టపల్లి, దర్మతాల గూడెం ప్రాంతాలు గత 30 ఏళ్లలో ముంపునకు గురికాలేదు. తాజా వరద వాటిని ముంచేసింది. మండలంలో మరో 30 జనావాసాలు నీట మునిగాయి. కొండలపైన, మెయిన్ రోడ్డులోని ప్రభుత్వ స్కూళ్లలో బాధితులు కట్టుబట్టలతో వారం రోజులు ఉన్నారు. చింతూరులో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాన సెంటర్‌లో 20 అడుగుల ఎత్తులో నీరు ప్రవహించింది. అక్కడి ప్రజలు యర్రంపేటలోని ఎపిఆర్ స్కూల్‌లో ఆశ్రయం పొందారు. వరద తగ్గడంతో ప్రస్తుతం తిరిగి ఇళ్లకు వెళ్తున్నారు. గత రెండ్రోజులుగా ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. కూనవరం ప్రజలు కోతుల గుట్టలో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటరు పొడుగునా బరకాలతో తాత్కాలిక గుడిసెలు వేసుకుని ఇప్పటికీ జీవిస్తున్నారు. కట్టుబట్టలే మిగిలాయని అక్కడి గిరిజనులు వాపోతున్నారు.











