Dec 18,2022 12:49

క మడుగులోని మొసలికి, నక్కకు స్నేహం కుదిరింది. నక్క ప్రతిరోజూ మొసలిపై కూర్చుని అవతలి ఒడ్డుకు ప్రయాణం చేసి సరదా తీర్చుకునేది. నక్క అప్పుడప్పుడు ఇతర జంతువులను మంచినీరు తాగుదామని తీసుకు వచ్చేది. అందులో మొసలి ఉన్న సంగతి వాటికి తెలియక దానికి ఆహారమవుతూ ఉండేవి. ఆ మొసలి ఎప్పుడూ నీటిలో మునిగి ఉండేది.
           ఒకసారి మొసలి నక్కతో 'మిత్రమా! నాకు కుందేలు మాంసం తినాలని ఉంది. నీ మిత్రుని ఈ చిన్న కోరిక తీర్చగలవా..' అని అడిగింది. సరేనన్న నక్క మొసలిని చచ్చిపోయినట్లు నీటిపైన తేలుతూ ఉండమని సలహా ఇచ్చింది. అందుకు మొసలి 'సరే' అంది.
        వెంటనే నక్క, కుందేలు వద్దకు వెళ్లి, ఆ మడుగు అందాలను చూద్దామని, కుందేలును ఆహ్వానించింది. అప్పుడు కుందేలు 'అమ్మో! ఆ మడుగులో మొసలి ఉంది, నేను రాను' అంది. అప్పుడు నక్క 'ఆ మొసలి ఎప్పుడో చనిపోయింది. కావాలంటే నీవే వచ్చి దూరాన ఉండి, చూడు' అని నమ్మబలికింది. నమ్మిన కుందేలు నక్కతోపాటు ఆ మడుగు వద్దకొచ్చింది. అక్కడ దానికి నీటిపైన తేలి ఉన్న మొసలి కనిపించింది.
ఇందులో ఏదో మోసం ఉన్నదని గ్రహించిన కుందేలు బిగ్గరగా 'నక్కమామా! ఈ మొసలి చచ్చి ఎన్నిరోజులైంది?' అడిగింది. 'నాలుగు రోజులు' అంది నక్క. 'నాలుగురోజుల్లా కనిపించడం లేదే?' అంది కుందేలు. అది విన్న మొసలి టక్కున 'నాలుగు రోజులు కాదు. ఒక్క రోజే!' అంది. వెంటనే కుందేలు మొసలి బతికున్నదని గ్రహించి, అక్కడి నుండి పారిపోయింది.
          అప్పుడు నక్క మొసలిని గట్టిగా చీవాట్లు పెట్టి 'ఎక్కడైనా చచ్చినవారు మాట్లాడతారా? దొరికిన అవకాశం చేజారిపోయేలా చేశావు' అంది. అప్పుడు మొసలి ఇకముందు నక్క చెప్పినట్లు నోరెత్తనని మరొక కుందేలును తీసుకు రమ్మని కోరింది.
         'సరే' అంటూ నక్క మరొక కుందేలును తీసుకొచ్చింది. ఆ కుందేలు మొసలిని గమనించి 'ఇక్కడ మొసలి ఉంది' అంది. అప్పుడు నక్క 'భయపడకు.. చనిపోయిందిలే' అంది. అప్పుడు కుందేలు నక్కతో 'చనిపోయిన మొసలి తలను ఆడిస్తుందని మా నానమ్మ చెప్పేది. మరి ఇది తలను ఆడించదేం?' అని అంది. వెంటనే మొసలి తలను ఆడించడం మొదలుపెట్టింది. అది చూసి మొసలి బతికే ఉందని భావించిన కుందేలు అక్కడి నుండి పరుగుతీసింది.
         నక్క మళ్లీ మొసలిని చీవాట్లు పెట్టింది. అప్పుడు మొసలి 'మాట్లాడవద్దని చెప్పావు కానీ కదలొద్దని చెప్పలేదుగా?' అంది. అప్పుడు నక్క 'నీవు మాట్లాడకు, కదలకు. నేను చెప్పినట్లు వింటే నీకు కుందేలు మాంసం లభిస్తుంది!' అని హెచ్చరించింది. మొసలి సరేనంది.
నక్క ఇంకొక కుందేలును తీసుకొచ్చి 'మనం ఈ చచ్చిన మొసలిపై ఎక్కి, ఎంచక్కా అవతలి ఒడ్డుకు వెళ్దాం పద! అక్కడ మామిడిపండ్ల తోట ఉంది. వాటిని తినవచ్చు' అంది. అప్పుడు కుందేలు 'నక్క మామా! మొదట నీవు వెళ్లిరా! తర్వాత నేను నీతో వస్తా! ఎందుకంటే నీటి మీద ప్రయాణమంటే నాకు భయం. నీవు వెళ్లొస్తే నాకు ధైర్యం వస్తుంది' అంది. 'సరే! అలాగే లే!' అని మొసలిపై ఎక్కి పదమంది. మొసలి కదలలేదు. నక్క దానిపై ఒక్క పోటు పొడిచి, నడవమంది. గత్యంతరం లేని మొసలి వెంటనే అవతలి ఒడ్డు వరకూ వెళ్లొచ్చింది.
          నీటిలో నుండే నక్క కుందేలును రమ్మని పిలిచింది. అప్పుడు కుందేలు 'నక్క మామా! మొసలి బతికి ఉంటేనేగా నీవు వెళ్ళి, రాగలిగావు. నేనేం తెలివితక్కువ దాన్నా? నీ ఆటలు మా కుందేళ్ల దగ్గర సాగవు. మీరిద్దరూ మమ్మల్ని మోసం చేయాలని చూశారు. కానీ మీరే మోసపోయారు. అంతేకాదు. మీరే తెలివితక్కువ వారని ఋజువు చేసుకున్నారు. ఈ మూర్ఖురాలితో స్నేహం చేసి, నీవూ తెలివితక్కువ దానివైనావు. అందుకే మంచివారితో స్నేహం చేసి, నీ తెలివిని మంచి పనులకు ఉపయోగించడం నేర్చుకో! మా కుందేళ్లు అంతా చెప్పాయిలే. మీకు బుద్ధి చెబుదామనే ఇలా వచ్చాను!' అంటూ కుందేలు వెళ్లిపోయింది.
      మొసలి నక్కకు చీవాట్లు పెట్టింది. నక్క సిగ్గుపడి, అక్కడి నుండి వెళ్ళిపోయింది. అందుకే సమయస్ఫూర్తి, తెలివి ఉంటే ఎంతటి ఆపదనైనా తప్పించుకోవచ్చు.

సంగనభట్ల చిన్న రామకిష్టయ్య,
9908554535.