Jan 26,2023 21:04
  • రేపు 9వ బెర్త్‌ కోసం దక్షిణాఫ్రికాతో ఢీ

బెంగళూరు : ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రపంచకప్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరడంలో విఫలమైన భారత హాకీ జట్టు వర్గీకరణ(స్థానాలకు) గురువారం జరిగిన మ్యాచ్‌లో సత్తా చాటింది. వర్గీకరణ మ్యాచ్‌లో భారత్‌ 8-0గోల్స్‌ తేడాతో జపాన్‌పై ఘన విజయం సాధించింది. తొలి రెండు క్వార్టర్స్‌ ముగిసే సరికి ఇరుజట్లు ఒక్క గోల్‌నూ నమోదు చేయలేకపోయాయి. మూడు, నాలుగు క్వార్టర్స్‌లో భారత్‌ నాలుగేసి గోల్స్‌ చొప్పున కొట్టింది. మూడో క్వార్టర్‌లో మన్‌దీప్‌(33వ ని.), వివేక్‌ సాగర్‌(40వ ని.)లో ఒక్కో గోల్‌ కొట్టగా.. అభిషేక్‌ రెండు గోల్స్‌ చేశాడు. దీంతో మూడో క్వార్టర్‌ ముగిసే సరికి భారత్‌ 4-0ఆధిక్యతలో నిలిచింది. ఇక నాల్గో క్వార్టర్‌ ప్రారంభంలోనే 46వ ని.లో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ ఒక గోల్‌ కొట్టడంతో 5-0 ఆధిక్యతలో నిలిచినా.. మ్యాచ్‌ మరో 2నిమిషాల్లో ముగుస్తుందనగా వరుసగా మూడు గోల్స్‌ చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ రెండు, మన్‌ప్రీత్‌, సుఖ్‌జీత్‌ ఒక్కో గోల్‌ చేశాడరు. మరో పోటీలో అర్జెంటీనా జట్టు 8-0గోల్స్‌ తేడాతో చిలీని ఓడించింది. శనివారం 9-12స్థానాలకు జరిగే వర్గీకరణ పోటీలో భారతజట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. మరో పోటీలో అర్జెంటీనా జట్టు వేల్స్‌తో తలపడనుంది.
28న బెర్త్‌లకు జరిగే వర్గీకరణ పోటీలు..
9-12 బెర్తులకు..
దక్షిణాఫ్రికా × ఇండియా
అర్జెంటీనా × వేల్స్‌
13-16 బెర్తులకు..
మలేషియా × జపాన్‌
చిలీ × ఫ్రాన్స్‌