Sep 20,2023 10:23
  • ప్రాణాలు పోతున్నా విద్యార్థులను కాపాడి మృతి

ప్రజాశక్తి-అద్దంకి (బాపట్ల జిల్లా) : పాఠశాల బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ అంత బాధలోనూ సమయస్ఫూర్తితో బస్సును పక్కకు తీసి ఆపాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాసేపటికే గుండెపోటుతో మృతి చెందారు. ప్రాణాలు పోతున్నా డ్రైవర్‌ పిల్లలను కాపాడారు. ఈ సంఘటన బాపట్ల జిల్లా అద్దంకిలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అద్దంకి పట్టణానికి చెందిన గుర్రాల ఏడుకొండలు (55) చైతన్య పాఠశాలలో బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఎప్పటిలాగానే వెంపరాల రూట్‌లోని గ్రామాలలో విద్యార్థులను ఎక్కించుకొని పాఠశాలకు వస్తున్నారు. వెంపరాల సమీపంలో ఏడుకొండలుకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో బస్సును రోడ్డు పక్కన నిలిపారు. గుండె నొప్పిగా ఉందని విద్యార్థులకు తెలిపి మంచినీరు తాగాడు. వెంటనే స్టీరింగ్‌పైనే కుప్పకూలిపోయారు. స్థానికులు గమనించి డ్రైవర్‌ను కిందకు దించారు. అప్పటికే ఆయన మృతి చెందారు. స్కూల్‌ యాజమాన్యం, పోలీసులు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థులను అదే బస్సులో మరో డ్రైవర్‌ సాయంతో అద్దంకికి చేర్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.