Jul 09,2022 09:46
  • అమ్మకం దిశగా యాజమాన్యం చర్యలు
  • కోక్‌ ఒవెన్‌ 1, 2 బ్యాటరీలపై ప్రయివేటు ఆధిపత్యానికి అడుగులు
  • వ్యతిరేకిస్తున్న స్టీల్‌ కార్మికవర్గం

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను బహిరంగ మార్కెట్‌లోకి నెట్టే కుట్రలకు ప్లాంట్‌ యాజమాన్యం పాల్పడుతోంది. ఉక్కు కర్మాగారాన్ని అమ్మాలని కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి కార్మిక వర్గం ఉద్యమిస్తున్నా పట్టించుకోకుండా స్టీల్‌ ఉత్పత్తికి అత్యంత కీలకమైన కోక్‌ ఒవెన్‌ బ్యాటరీ 1, 2లను మెయింటెనెన్స్‌ పేర ప్రయివేటుకు అప్పగించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. గత నెల 26న అందుకు టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 14, 15 తేదీల్లో ఈ టెండర్లను తెరిచేందుకు సమాయత్తమైంది. ఈ మొత్తం ప్రక్రియ అంతా చాపకింద నీరులా స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేసేందుకే అన్నది తేటతెల్లమవుతోంది. ఓ వైపు స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం అన్ని తరగతుల ప్రజానీకం కార్మికవర్గంతో పోరాటాల్లో మమేకం అవుతున్న క్రమంలో దొడ్డిదారిన విడి విభాగాలను అమ్మేసే వ్యూహాన్ని యాజమాన్యం చేపట్టింది. గడచిన కొద్ది నెలలుగా ఈ చర్యలు కొనసాగుతున్నా టెండర్ల దశను కూడా తాజాగా దాటింది. దీంతో స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు ఈ టెండర్లను రద్దు చేయాలంటూ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు.
 

                                                                     టెండర్ల ద్వారా ప్రై'వేటు'కు..

స్టీల్‌ప్లాంట్‌లో అత్యంత కీలకమైన స్థానం ఉత్పత్తిదైతే.. ఆ ఉత్పత్తికి చోదకశక్తిగా కోకో ఒవెన్‌ బ్యాటరీలు 1, 2 నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ప్లాంటులో మొత్తం ఇలా 5 కోకో ఒవెన్‌ బ్యాటరీలు ఉన్నాయి. బొగ్గులోని చెత్తా చెదారాలను అన్నింటినీ తొలగించి కోక్‌ను ఇవి తీస్తాయి. ఈ కోక్‌ను స్టీల్‌ తయారు చేసే బ్లాస్ట్‌ఫర్నేస్‌ (బిఎఫ్‌)ల్లో వినియోగిస్తారు. ఒక్కో కోకో ఒవెన్‌ బ్యాటరీలో 200 మంది పర్మినెంట్‌, 300 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. పై రెండు కోక్‌ ఒవెన్‌ బ్యాటరీలను రెండేళ్లపాటు కాంట్రాక్టుకిచ్చేందుకు తాజాగా టెండర్లను యాజమాన్యం పిలిచింది. కోక్‌ తయారు చేయడానికి అవసరమైన బొగ్గును యాజమాన్యం ఇస్తుందని, కేవలం బ్యాటరీలను ఆపరేషన్‌ చేసి నిర్వహించేందుకు రెండేళ్లకు రూ.32 కోట్లు ఇస్తామని యాజమాన్యం వెల్లడించింది. ఇది ప్రయివేటు సంస్థలకు నిజంగా బంపర్‌ ఆఫర్‌ కాగలదు. ఎందుకంటే ఉత్పత్తి మొత్తం నియంత్రణ ఈ బ్యాటరీ విభాగాలపైనే ఆధారపడి ఉంటుంది. ఉక్కు ఉత్పత్తికి కావాల్సిన బొగ్గును తయారు చేయడంలో బ్యాటరీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు పనిచేయాలంటే కోకో ఒవెన్‌ బ్యాటరీలు నడపాలి. ప్రయివేటు యాజమాన్యానికే వీటిని వదిలేస్తే అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఉందని స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
 

                         రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయాలి : జె.అయోధ్యరాం, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌

రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు తొలినాళ్లలో మద్దతు తెలిపి ఊరుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఆ పార్టీ రాష్ట్ర ప్లీనంలో స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలి. ప్లాంట్‌ ప్రయివేటీకరణ కాకుండా కార్మికవర్గం ఏడాదిన్నరగా పోరాడుతోంది. కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలదీసి అడగకపోతే తీవ్ర నష్టం జరుగనుంది. ఉత్పత్తికి అవసరమైన రా మెటీరియల్‌ను స్టీల్‌ యాజమాన్యం కొనకుండా తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. 2021-22లో రూ.650 కోట్లు నికర లాభాలను ప్లాంట్‌ ఆర్జించింది. ఆర్థిక సమస్య లేనేలేదు. ప్లాంట్‌లో అత్యంత కీలకమైనవి కోకో ఒవెన్‌ బ్యాటరీలు. అవి టెండర్ల ద్వారా ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళితే ప్రమాదం. సదరు వ్యక్తులు వాటికి తాళం వేస్తే ప్లాంట్‌లోని బ్లాస్ట్‌ ఫర్నేస్‌ (బిఎఫ్‌)లు షట్‌డౌన్‌ అవుతాయి. ఇది స్టీల్‌ప్లాంట్‌ మనుగడకే ప్రమాదం. యాజమాన్యం చేపడుతున్న తాజా చర్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తక్షణం స్పందించాలి.