- జిపిఎస్ రద్దు చేయాలని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు
- ఒపిఎస్‌ను పునరుద్ధరించాలంటూ నినాదాలు
ప్రజాశక్తి - యంత్రాంగం : జిపిఎస్‌ను మంత్రి మండలి తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ ఫ్యాప్టో, ఎపిసిపిఎస్‌ఇఎ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. పోలీసుల ఆంక్షలను, బారికెడ్లను తోసుకుంటూ కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించారు. తమ సమస్యలను వివరిస్తూ కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. కడపలో పలువురి నాయకులను అరెస్టు చేసి, అనంతరం విడుదల చేశారు.
కర్నూలులో కలెక్టరేట్ గేట్లు ఎక్కి నిరసన తెలిపారు. ఫ్యాప్టో రాష్ట్ర కో-చైర్మన్ కె.ప్రకాష్‌రావు, ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.సురేష్ కుమార్, జి.హృదయ రాజు, ఎపిసిపిఎస్‌ఇఎ గౌరవ అధ్యక్షులు లింగారెడ్డి, తదితరులు మాట్లాడారు. సిపిఎస్, ఒపిఎస్ ముగిసిన అధ్యాయాలు అని, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ లేకుండా ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌తో జిపిఎస్ తీసుకురావడం దారుణమన్నారు. కడప కలెక్టరేట్ ప్రాంతంలో బారికేడ్లను తోసుకుని ఫ్యాప్టో నాయకులు ముందుకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఫ్యాప్టో జిల్లా చైర్మన్ విజయకుమార్, ట్రెజరర్ వై.వెంకటసుబ్బయ్య, ఎపిటిఎఫ్ (257) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.శ్యాంసుందర్‌రెడ్డి, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్‌బాబు, ఎస్‌టియు జిల్లా అధ్యక్షులు పి.రమణారెడ్డి, ఎస్‌టియు జిల్లా నాయకులు పుల్లయ్యను అరెస్టు చేసి, విడుదల చేశారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు.
కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఉపాధ్యాయులను పోలీసులు నిర్బంధించారు. మరికొందరిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన 60 మంది ఉపాధ్యాయులను వ్యక్తిగత పూచీకత్తుపై ఆ తర్వాత విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రరవరం కలెక్టరేట్, కాకినాడలో ధర్నాచౌక్ వద్ద, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, చిత్తూరు, విశాఖ, అనకాపల్లి, బాపట్ల, ఒంగోలు, ఏలూరు, అనంతపురం కలెక్టరేట్ల వద్ద ధర్నా చేపట్టారు. జిపిఎస్, సిపిఎస్‌లను రద్దు చేయాలంటూ విజయనగరం, పార్వతీపురం మన్యం కలెక్టరేట్ల వద్ద ప్లకార్డులు ప్రదర్శించారు. పార్వతీపురంలో డిఇఒ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ సమీపంలోని జ్యోతిరావు పూలే పార్కు నుంచి ర్యాలీ చేశారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ముందుకు తోసుకుంటూ కలెక్టరేట్ గేట్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ఆందోళనలో ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకులు ఎస్.చిరంజీవి పాల్గొన్నారు. గుంటూరులో ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ఫ్యాప్టో సభ్యులు తిమ్మన్న పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ధర్నా చౌక్ వద్ద నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.













