ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు వెనకున్న రాజకీయ కుట్రల్ని, ఆధారాల్లేని కేసుల్లో జైలుకు పంపిన వైనాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర గవర్నరు అబ్దుల్ నజీర్‌ను టిడిపి నేతలు కోరారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నరును బుధవారం కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై వైసిపి ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులకు సంబంధించిన పూర్తి వాస్తవాలను గవర్నరుకు అందించామని చెప్పారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సిఐడి, పోలీస్ వ్యవస్థను జేబు సంస్థలుగా మార్చుకుని టిడిపి నేతలు, మీడియా సంస్థలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు. అవినీతి జరగని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు రూ.370 కోట్ల అవినీతికి పాల్పడ్డారని జగన్ ప్రభుత్వం ఆరోపణలు చేసి దిగజారి రూ.27 కోట్లకు చెప్పిందని విమర్శించారు. చివరకు ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన సంస్థ, కేంద్ర ప్రభుత్వానికి జిఎస్‌టి చెల్లింపులు చేయనందునే చంద్రబాబుపై కేసు పెట్టినట్లు ప్రభుత్వం వాదిస్తోందన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్‌నెట్ ప్రాజెక్టులు, ఇన్నర్ రింగ్‌రోడ్డుపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పి కొడుతూ తాము ఇప్పటికే ప్రజల ముందు ఉంచిన వాస్తవాలను గవర్నరుకు అందించామని చెప్పారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు, కోర్టులో జరుగుతున్న విచారణ అంతా తనకు తెలుసునని గవర్నరు తమతో చెప్పారని తెలిపారు. గవర్నరును కలిసిన వారిలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, బోండా ఉమామహేశ్వరరావు, ఎంఎ షరీఫ్, ఎమ్మెల్సీలు అనురాధ, అశోక్‌బాబు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు తదితరులు ఉన్నారు.










