ప్రజాశక్తి-అనకాపల్లి : టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి సతీమణి మాధవీలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏ నోటీసూ ఇవ్వకుండా రాత్రి నుంచి పోలీసులు తమను నిర్బంధించారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డీఎస్పీ సత్యనారాయణ, పోలీసులు తమను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు.
రోజాపై అసభ్య పదజాలంతో మాట్లాడరనే ఫిర్యాదతో బండారు సత్యనారాయణపై గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. బండారు సత్యనారాయణపై ఐపీసీ సెక్షన్ 153ఏ, 504, 354ఏ, 505, 506, 509, 499, ఐటీ సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు. ఇక, బండారు సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీకి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ కూడా ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీంతో అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలోని బండారు సత్యనారాయణమూర్తి ఇంటి వద్ద ఆదివారం అర్ధరాత్రి దాటాక పెద్దఎత్తున పోలీసులు మోహరించడం ఉద్రిక్తతకు దారితీశాయి.










