Apr 12,2023 12:40

ఐపీఎల్‌ 2023 సీజన్లలో కీలక ఆటగాళ్లు గాయపడడం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియంసన్‌, ఫీల్డింగ్‌ చేస్తూ తీవ్రంగా గాయపడి, వన్డే వరల్డ్‌ కప్‌కే అనుమానంగా మారగా ఇప్పుడు ఈ లిస్టులో సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా చేరాడు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబైఇండియన్స్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ కొట్టిన బంతిని బౌడరీలైన్‌ వద్ద క్యాచ్‌ అందుకునే ప్రయత్నం సూర్య గాయపడ్డాడు. ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ జాసన్‌ బెహండార్ఫ్‌ వేశాడు. ఆ ఓవర్‌ మూడో బంతిని లాంగాన్‌ దిశగా సిక్సర్‌ బాదిన అక్షర్‌ నాలుగో బంతిని కూడా లాంగాన్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు. ఈసారి సూర్య బౌండరీ వద్ద క్యాచ్‌ అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే చేతి నుంచి పట్టుజారిన బంతి సూర్య కుడి కంటి పైభాగానికి తగిలింది. దీంతో కంటికి చిన్న గాయమైంది. ఫిజియో వచ్చి పరీశీలించి డగౌట్‌కు తీసుకెళ్లాడు. కంటి పైభాగంలో ఏర్పడిన గాయానికి కుట్లు పడ్డట్లు తెలుస్తోంది. మొత్తానికి సూర్య గాయం ముంబై ఇండియన్స్‌ శిబిరంలో కాస్త ఆందోళన రేపింది. అతని గాయం గురించి అప్‌డేట్‌ రావాల్సి ఉంది.