Sep 11,2022 07:44
  • అక్టోబరు నుంచి డిసెంబరు వరకూ నిర్వహణ
  • కౌలు రైతుల గుర్తింపునకు అవకాశం
  • రెవెన్యూ, ప్రణాళిక శాఖల కసరత్తు

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : దేశంలో వాస్తవసాగుదారులను గుర్తించే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర భూ సర్వేను చేపట్టనుంది. కేవలం వ్యవసాయ ఆధారిత భూములను మాత్రమే ఈ సర్వేలో గుర్తిస్తారు. భూ యజమానులు, కౌలు రైతులను కూడా ఈ సర్వేలో నమోదు చేస్తారు. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఈ సర్వే నిర్వహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రెవెన్యూ శాఖతోపాటు ప్రణాళిక శాఖాధికారులు కూడా ఈ సర్వేలో పాల్గొంటారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి మార్గదర్శకాలపై గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారులు, ప్రణాళిక శాఖలో సహాయ స్టాటిస్టికల్‌ అధికారులకు తొలి విడత శిక్షణ నిర్వహించారు. కనీనం పది సెంట్లు తగ్గకుండా ఉన్న సాగు భూమిని ఈ సర్వేలో గుర్తిస్తారు. సాగు భూమిపై ఎవరు హక్కుదారులో నిర్ధారిస్తారు. భూ యజమానులకు ఉన్న పత్రాలను పరిశీలిస్తారు. వాస్తవంగా సంబంధిత భూమిలో ఎవరు సాగు చేస్తున్నారు. వారికి సాగు ధ్రువీకరణ పత్రాలను అందించేందుకు ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇదే సమయంలో కౌలు రైతులను కూడా గుర్తిస్తారు. వీరికి ప్రత్యేక గుర్తింపు పత్రాలు ఇస్తారా? లేదా? అన్నదీ ఇంకా స్పష్టత రాలేదు. డిసెంబరు చివరి నాటికి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఈ సర్వే జరుగుతుందని ఈసారి కొన్ని మార్పులు జరిగినట్టు అధికార వర్గాలు తెలిపాయి. కరోనా నేపథ్యంలో మూడేళ్లుగా ఈ సర్వే జరగలేదు. '11వ సెన్స్‌స్‌ ఫర్‌ ల్యాండ్‌ హోల్డర్స్‌' పేరుతో భూ కమతాల గుర్తింపునకు ఈ సర్వే నిర్వహించనున్నారు. గతంలో కౌలు రైతులను గుర్తించలేదు. ఈసారి కౌలు రైతులను కూడా గుర్తించాలని సర్వే యాప్‌లో ఒక కాలమ్‌ ఏర్పాటు చేశారు. ఎస్‌సి, ఎస్‌టిలు, మహిళలు, పురుషులు, చిన్న, సన్నకారు రైతులు, రెండున్నర ఎకరాల దాటి ఉన్న మధ్యతరహా రైతులు, పది ఎకరాలుమించి ఉన్న భూ యజమానులను వేర్వేరుగా గుర్తిస్తారు. కనిష్టంగా పది సెంట్ల వ్యవసాయ భూమి ఉన్నా వారిని కూడా గుర్తించాలని నిర్ణయించారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, జలవనరుల, ప్రణాళిక శాఖల జిల్లా అధికారులతోపాటు నేషనల్‌ ఇన్‌ఫర్‌మేటిక్‌ సెంటర్‌ అధికారులు సభ్యులుగా ఉంటారు. జిల్లా ముఖ్య ప్రణాళిక శాఖాధికారి మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ సర్వే తరువాత ఎవరి ఆధీనంలో ఎంత భూమి ఉందో గుర్తిస్తారు. సాగు చేస్తున్నా హక్కు పత్రాలు లేనివారికి ఈ కమిటీ స్థానికంగా విచారించి తగిన ఆధారాలు చూపితే హక్కు పత్రాలను జారీ చేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.