Dec 20,2022 12:56

ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : పట్టుదలతోనే విజయం సాధ్యమని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మంగళవారం స్థానిక మారేడుబాక రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా ఉపాధి, రాష్ట్ర నైపుణ్య సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌ మేళాలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమయపాలన చాలా ప్రాముఖ్యమైందన్నారు. ఎప్పటికప్పుడు స్కిల్‌ను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ జాబ్‌ మేళాలో హెట్రో డ్రగ్స్‌, అపోలో ఫార్మసీ, గోపాల ఆటోమోటివ్‌, ఆర్టోస్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, పేటీఎం, ఐ ఎం ఇండిస్టీస్‌, ఐజాన్‌ ఎంటర్ప్రైజెస్‌, డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌, రేడియంట్‌ ఎలక్ట్రానిక్స్‌ తదితర కంపెనీలకు సుమారు 300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పతివాడ నూక దుర్గారాణి గ్రామ సర్పంచ్‌ మట్టపర్తి గోవిందరాజు, వైసీపీ నాయకులు తోటా పథ్వీరాజ్‌, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ టికెవి శ్రీనివాసరావు అధ్యాపకులు డాక్టర్‌ మధు తదితరులు పాల్గొన్నారు.