Sep 23,2023 20:36
  •  పాఠశాల విద్య కమిషనరు సురేష్‌కుమార్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని పాఠశాల విద్యాశాఖ కమిషనరు, స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు ఎస్‌ సురేష్‌కుమార్‌ అన్నారు. ప్రతి పాఠశాల నుంచి కనీసం ప్రతిభ గల ఇద్దరు విద్యార్థులను గుర్తించాలని చెప్పారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీలతో వర్క్‌షాపుతోపాటు కార్యవర్గ సమావేశాన్ని శనివారం సమగ్ర శిక్షా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. పాఠశాలలకు క్రీడా సామగ్రి అందిస్తున్నామని తెలిపారు. ప్రతినెలా నిర్వహించే స్కూల్‌ కాంప్లెక్సులో క్రీడా సామగ్రి వినియోగంపై అవగాహన కల్పించాలని చెప్పారు. స్కూల్‌ కాంప్లెక్సు పరిధిలో పిఇటిలు లేని పాఠశాలల్లో స్థానిక ఉపాధ్యాయుల్ని గుర్తించి క్రీడలను ప్రోత్సహించేలా బాధ్యతలు అప్పగించాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ యాజమాన్య పాఠశాలలు ఫిట్‌ ఇండియా యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేయాలన్నారు. ఇప్పటి వరకు 12 జిల్లాల్లోని పాఠశాలలకు క్రీడా సామగ్రి అందించామని, మిగిలిన జిల్లాలకు అక్టోబరు 16లోపు ప్రణాళిక ప్రకారం అందిస్తామని సమ్రగ శిక్ష ఎఎస్‌పిడి కెవి శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. సీనియర్‌ సెకండరీ పాఠశాలలకు 17 వస్తువులు, ప్రాథమికోన్నత పాఠశాలలకు 14, ప్రాథమిక పాఠశాలలకు 9, ఉన్నత పాఠశాలకు 17 వస్తువుల చొప్పున క్రీడా సామగ్రి అందిస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షులు పి పార్వతి, కార్యదర్శి జి భానుమూర్తిరాజు తదితరులు పాల్గొన్నారు.