- పాఠశాలల తనిఖీలో రాష్ట్ర విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్
ప్రజాశక్తి-పోరుమామిళ్ల (కడప జిల్లా) : విద్యార్థులను నిలబెట్టి చదువు నేర్పుతున్న ఉపాధ్యాయుడిపై ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పిల్లలకు ఇదే విధంగా విద్యను నేర్పుతారా?... మనస్సాక్షితో పని చేయండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం ఆయన సందర్శించారు. విద్యార్థులను తరగతిలో నిలబెట్టి పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడిపై మండిపడ్డారు. నాడు, నేడు పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, ఎందుకింత ఆలసత్వం వహిస్తున్నారని, జిల్లా ఉన్నతాధికారులు, సచివాల సెక్రటరీలు నిద్ర పోతున్నారా? అని ప్రశ్నించారు. విద్యావ్యవస్థలో మార్పులు రావాలంటే ప్రక్షాళన చేయాలని అన్నారు. తొమ్మిదవ తరగతి విద్యార్థులు యూనిఫామ్ ఎందుకు వేసుకుని రాలేదని ప్రశ్నించగా, టైలర్ దగ్గర ఉన్నాయని ఉపాధ్యాయులు సమాధానమిచ్చారు. అనంతరం కలపపాడు మండలంలోని బాలుర, బాలికోన్నత పాఠశాలలో చేపట్టిన నాడు-నేడు పనులను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తనిఖీ చేశారు. పనులు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉన్నవా? లేవా?అని పరిశీలించారు. అనంతరం విద్యార్థి తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన వెంట ఆర్‌జెడి వెంకటకృష్ణారెడ్డి, సచివాలయ సెక్రటరీ రఘురాములు, డిఇఒ రాఘవరెడ్డి, ఎస్‌ఎస్‌ఎ పిఒ అంబవరం ప్రభాకర్ రెడ్డి, ఆర్‌ఐఒ రమణ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.










