ఇంటర్నెట్‌డెస్క్ : వర్షాకాలంలో వేడివేడిగా తినాలని భావిస్తాం. ఎప్పటికప్పుడు వేడివేడిగా వండుకుని తింటేనే ఆరోగ్యానికి కూడా మంచిది. కానీ కొంతమంది చికెన్, చేపలు, రొయ్యలతో చేసిన కూరలు మిగిలి ఉంటే.. వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టి.. రెండు మూడురోజుల తర్వాత కూడా వాటిని తీసి మళ్లీ వేడి చేసుకుని తింటారు. అలా చేయడం వల్ల వాటిల్లో ఉండే ప్రొటీన్స్ విషంగా మారి ఆరోగ్యానికి ప్రమాదాన్ని తెచ్చి పెడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చికెన్: చికెన్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రొటీన్ బాగా దొరుకుతుంది. అయితే ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసుకొని తర్వాత పదే పదే వేడిచేసినప్పుడు అందులో ఉండే ప్రొటీన్ రూపాంతరం చెంది ప్రమాదకరంగా మారుతుంది. ఒక్కోసారి విషంగా కూడా మారుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు. ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల అజీర్తి సమస్యలు కూడా తలెత్తుతాయని వైద్యులు సూచిస్తున్నారు.
అన్నం : ఉడికించిన అన్నం మిగిలిపోయిందని చాలామంది ఫ్రిడ్జ్‌లో పెడతారు. అలా ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచిన అన్నాన్ని బటయకు తీసి.. మరలా వేడి చేసి తింటే ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. ఫ్రిడ్జ్‌లో ఎక్కువరోజులు నిల్వ చేసి ఉంచిన అన్నంలో వాతావరణంలో హానికరమైన బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. అందుకే ఉడికించిన అన్నాన్ని ఫ్రిడ్జ్‌లో నిల్వ చేయకుండా.. ఎప్పటికప్పుడు తింటేనే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.
చేపలు, రొయ్యలు : చేపలు, రొయ్యలు వంటి సముద్ర ఆహారాన్ని తాజాగానే తీసుకోవాలి. నిల్వ ఉంచితే వాటి రుచి పోతుంది. వాటిల్లో ఉండే పోషకాలు కూడా తగ్గిపోతాయి. సీ ఫుడ్స్‌ని ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచి.. ఆ తర్వాత వేడి చేసి తినడం వల్ల చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. చర్మంపై దద్దుర్లు, దురద వంటి సమస్యలు వస్తాయి.
- సీ ఫుడ్స్ మాత్రమే కాదు.. గుడ్డుతో చేసిన కూరలను కూడా అస్సలు వేడి చేసి తినకూడదు. అతిగా వేడి చేసి తింటే.. వాటిల్లో ఉండే ప్రొటీన్స్ తగ్గిపోతాయి. ప్రొటీన్లు ఉన్న ఆహారంలో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. అతిగా వేడిచేయడం వల్ల అది ఆక్సిడైజ్ అయి క్యాన్సర్‌కు దారితీస్తుంందని వైద్యులు చెబుతున్నారు. అలాగే పాలకూరతో చేసే వంటకాల్ని కూడా వేడి చేసి తినకూడదు. పాలకూర పప్పు, పాలక్ పనీర్, పాలకూర పచ్చడి వంటివి వేడిచేసిన కొద్దీ నైట్రోసమైన్స్‌గా మారి క్యాన్సర్‌కు దారితీస్తాయి. ఇక ఈ కాలంలో మెండుగా దొరికే పుట్టగొడుగులను కూడా ఒక్కసారే వండుకుని తినాలి.