ప్రజాశక్తి-రాజోలు (అంబేద్కర్ కోనసీమ) : విద్య కోసం ప్రభుత్వం చేసే ఖర్చు, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు పెట్టుబడి లాంటిదని రాజోలు ఎంఎల్‌ఎ రాపాక వరప్రసాదరావు అన్నారు. అందువల్లే విద్య కోసం ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికైనా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు. మలికిపురం మండలం చింతలమోరి జడ్పీ హైస్కూల్ వద్ద 8వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ట్యాబ్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ ... విద్య, వైద్యం, వ్యవసాయానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలను విద్య కోసం వెచ్చించడం జరిగిందని, ఇది మానవ వనరుల కోసం పెట్టిన పెట్టుబడి అని చెప్పారు. ప్రాధమిక విద్యతోపాటు, ఉన్నత విద్యకు కూడా సమాన ప్రాధాన్యత కల్పించామన్నారు. మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేవిధంగా అత్యున్నత శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.










