- రెచ్చగొట్టిన మంత్రిపై చర్యలు తీసుకోరా?
- 17 మందికి సమాధానం చెప్పలేకే సస్పెన్షన్
- టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శాసనసభలో స్పీకరు వ్యవహరించిన తీరు చాలా దారుణంగా ఉందని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు విమర్శించారు. శాసనసభ సాక్షిగా ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వాలని స్పీకరే ప్రయత్నించారని అన్నారు. స్పీకరు స్థానంలో ఉన్న వ్యక్తికి అధికార పార్టీ శాసనసభ్యుల వెకిలి చేష్టలు, వెర్రిమొర్రివేషాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. టిడిపి ఎమ్మెల్యేలు శాసనసభలో సస్పెండైన తరువాత అసెంబ్లీ ప్రాంగణంలో కొంతసేపు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుంచి సచివాలయం వద్ద ఉన్న పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టి వెలగపూడిలో గురువారం మీడియాతో మాట్లాడారు. ఏం తప్పు చేశామని సభ నుంచి తమను సస్పెండ్ చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. మంత్రి రెచ్చగొడితే అతనిపై ఎలాంటి చర్యలు లేవని, కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు బూతులు తిట్టినా స్పీకరు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ 17 మంది సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక ప్రభుత్వం 200 మంది మార్షల్స్‌తో సభ నిర్వహిస్తోందని పేర్కొన్నారు. చంద్రబాబును అన్యాయంగా జైలుకు పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇదే అంశాన్ని తాము సభలో లేవనెత్తితే సమాధానం చెప్పలేక చర్చిస్తామంటూ కట్టుకథలు చెప్పారని విమర్శించారు. చంద్రబాబు భద్రతపై లోకేష్ అన్నది నిజమే అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జైలులో జరుగుతున్న పరిణామాలు, అక్కడి వసతులు, భద్రతపై తాము తొలి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు.
మంత్రి అంబటి తొడకొడితేనే నేనూ కొట్టాను : బాలకృష్ణ
మంత్రి అంబటి రాంబాబు తనకు వేలు చూపించి మీసం మెలేసి తొడకొట్టారని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. మంత్రి అతిగా స్పందించాకే తాను మీసం తిప్పి తొడకొట్టానని వివరించారు. తన వృత్తిని మంత్రి అవమానించారని అన్నారు. రాష్ట్రంలో నియంత పరిపాలన జరుగుతుందని, ఎక్కడా అభివృద్ధి లేదని విమర్శించారు. విశాఖలో జూనియర్ ఆర్టిస్టులతో పెట్టుబడుల సదస్సు నిర్వహించారని, ఈ సదస్సులో కుదిరిన ఎంఒయులను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. శాసనసభ అంటే వైసిపి కార్యాలయం అనే భావనలో ఉన్నారని పయ్యావుల కేశవ్ విమర్శించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి, బహిరంగ సభకు తేడా తెలియకపోతే ఎలా? అని ప్రశ్నించారు. సభలో ఎలా వ్యవహరించాలో తెలియదని, ఎవరైనా చెబితే అభద్రతాభావంతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారని ఆగ్రహించారు. వైసిపి ఎమ్మెల్యేలు గూండాల్లా ప్రవర్తించారని నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 200 మంది మార్షల్స్‌తో టిడిపి సభ్యుల్ని అడ్డుకోవాలని చూశారని, ఇది బ్లాక్ డే అని అన్నారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు, పాలకులు చేస్తున్న నిరాధార ఆరోపణలపై తాము వాస్తవాలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టామన్నారు. ఈ సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, డోలా వీరాంజనేయస్వామి, బుచ్చయ్య చౌదరి, గద్దె రామ్మోహనరావు, గొట్టిపాటి రవి, బెందాళం అశోక్, ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్సీ టిడి జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.










