Sep 24,2023 09:25

హైదరాబాద్‌ : రూ. 20కే హౌమియోపతి వైద్యం అందించిన ప్రముఖ హౌమియోపతి వైద్యుడు బెల్లపు సోహన్‌సింగ్‌ హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. శుక్రవారం రాత్రి గుండెనొప్పితో బాధపడిన ఆయనను వెంటనే జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్టు నిర్ధారించారు. కృష్ణా జిల్లాలోని రావులపాలెంలో జన్మించిన సోహాన్‌సింగ్‌ ఎంబీబీఎస్‌లో సీటు రాకపోవడంతో హౌమియోపతిలో చేరారు. అప్పటికి హౌమియోపతికి అంత ఆదరణ లేదు. అందులో ఎన్నో పరిశోధనలు చేశారు. కుమారుడి పేరుపై రామాంతపూర్‌లోని ప్రభుత్వ హౌమియోపతి కాలేజీలో సొంత ఖర్చులతో గదులను నిర్మించారు. రూ.20కే హౌమియోపతి వైద్యం అందించారు. తెల్లవారుజామునుంచే ఆయన క్లినిక్‌ వద్ద రోగులు బారులు తీరేవారు. దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స అందించడంలో పేరు సంపాదించారు. ఆయనకు భార్య విమల, కుమార్తె నీలిమ ఉన్నారు. కుమారుడు ధర్మకిరణ్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.