రోజీ, రాజు ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ గవర్నమెంట్ స్కూల్‌లో ఐదవ తరగతి చదువుతున్నారు. చదువులో పోటీపడి చదివేవారు. ఒకరోజు రోజీ స్కూలుకు రాలేదు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి రాజు ఆ సాయంత్రం రోజీ ఇంటికి వెళ్ళాడు. రోజీ నీరసంగా ఉంది.
'ఏంటి రోజీ స్కూల్‌కి రాలేదు? నీరసంగా ఉన్నావు.. ఏమైంది?' అని అడిగాడు రాజు.
'నాకు మొన్న సాయంత్రం స్కూల్ నుంచి రాగానే జ్వరం వచ్చింది రాజు. ఆచారిగారి దగ్గర వైద్యం చేయించుకుంటున్నాను. జ్వరం తగ్గింది కానీ నీరసంగా ఉంది రాజు' అంది రోజీ.
'మరి రేపు స్కూలుకు రావా అయితే?' అడిగాడు రాజు.
'రావాలనే ఉంది రాజు ఎలాగోలా! కానీ ఉమ మేడం హోం వర్క్‌గా ఇచ్చిన లెక్కలు రేపు చూస్తానన్నారుగా. నేను జ్వరం వచ్చి చేయలేదు రాజు.. మేడం కొడతారేమోనని భయమేస్తుంది!' అంది రోజీ.
'నీకు జ్వరమొచ్చే కదా చేయలేకపోయావు. అదే చెప్పు మేడంకి!'
'మేడం నమ్మరు రాజు.. మొన్న సునీత ఇలాగే జ్వరం రాకుండానే వచ్చినట్లు దొంగనాటకం ఆడిందని తెలిసి, కోప్పడ్డారు మేడం.. అందుకే నాకు నిజంగానే జ్వరం వచ్చినా నేనూ అబద్ధం చెప్తున్నానేమోనని మేడం అనుకుంటుందని భయం రాజూ!' అంది రోజీ.
'నువ్వేం భయపడకు రోజీ. మీ ఇంటికి నేను వచ్చానని, నీకు నిజంగానే జ్వరం వచ్చిందని, నీవు చెప్పేది నిజమేనని నేను చెప్తాలే మేడంగారికి' అని భరోసా ఇచ్చాడు రాజు.
మరుసటి రోజు స్కూల్‌కి వెళ్ళింది రోజీ. అందరినీ పిలిచి, నోట్స్ చెక్ చేస్తుంది ఉమాదేవి మేడం. రోజీని కూడా నోట్స్ తెమ్మంది. రోజీకి కాళ్ళలో ఒణుకు మొదలైంది. చిన్నగా నోట్స్ తీసుకువెళ్ళి ఇచ్చి, చేతులు కట్టుకుని తలవంచుకుని నిల్చుంది.
ఉమాదేవి మేడం నోట్సు చెక్ చేసి రైట్ కొట్టింది.
'వెరీగుడ్ రోజీ అన్ని లెక్కలు కరెక్ట్‌గా చేశావ్!' అంటూ భుజం తట్టి మెచ్చుకుంది. రోజీ జరిగిందానికి ఆశ్చర్యపోతూ అలాగే చూస్తుండిపోయింది.
రోజీని, రాజుని స్టాఫ్ రూంకి పిలిచిన ఉమాదేవి మేడం అడిగింది రాజుని..
'ఏం రాజు రోజీ నోట్స్‌లోని రైటింగ్ నీదని నాకు తెలియదని అనుకున్నావా? ఎందుకు చేశావీ పని? రోజీ హోంవర్క్ నువ్వు చెయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది? తను బాగానే చదువుతుంది కదా? అందరి ముందు అడిగి, మిమ్మల్ని అవమానించడం ఇష్టంలేక క్లాసులో అడగలేదు. అలా చేయొచ్చా' అన్నారు.
దానికి రాజు ఏడుస్తూ 'సారీ మేడం. రోజీకి జ్వరం వచ్చి హోంవర్క్ చేయలేదు. తాను హోంవర్క్ చేయలేదని మీరు దండిస్తారేమోనని రోజీకి తెలియకుండానే రోజీ హోం వర్క్ నేనే చేశాను. రోజీకి తెలిస్తే ఒప్పుకోదని రోజీకి చెప్పలేదు. అందుకే ఒక స్నేహితునిగా అలా చేశాను' అన్నాడు రాజు.
'రాజూ! నువ్వు మంచి ఉద్దేశ్యంతోనే చేశావు. కానీ నువ్వు చెయ్యాల్సింది అది కాదు. నన్ను కలిసి విషయం చెప్పినట్లయితే రోజీకి హోంవర్క్ చేయడానికి ఇంకోరోజు గడువు ఇచ్చేదాన్ని. ఆరోగ్యం సహకరించనప్పుడు సర్దుబాటు చేసుకోవాలి కదా. రోజీ హోంవర్క్‌ను చేసి నువ్వు దోషివయ్యావు.. రోజీని దోషిని చేశావు. ఆపదలో ఉన్న మిత్రుని ఆదుకోవడానికి ధర్మాన్ని తప్పకూడదు. అధర్మ మార్గంలో చేసే సహాయం అపఖ్యాతినిస్తుంది' అంది ఉమాదేవి మేడం.
రాజు తన తప్పును తెలుసుకుని, ఇంకెప్పుడూ అలా చేయనంటూ ఉమాదేవి మేడంను క్షమాపణ అడిగాడు. ఆ రోజు నుంచి రాజు, రోజీలు చాలా మంచి స్నేహితులుగా పేరుతెచ్చుకున్నారు.
గేరపాటి భానువర్ధన్
81065 86997