Apr 30,2023 20:53

పరారీలో ప్రధాన నిందితుడు నార్ల వెంకటేశ్వరరావు
సిసి కెమెరాలు ఆఫ్‌ చేసి పక్కా ప్రణాళికతో వ్యవహారం
ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం):
విశాఖలో తీవ్ర కలకలం రేపిన కిడ్నీ రాకెట్‌ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. నగర పోలీస్‌ కమిషనర్‌ సిఎం త్రివిక్రమ వర్మ తన కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం పెందుర్తి వాంబే కాలనీకి చెందిన జి వినరు కుమార్‌కు కిడ్నీ దానం చేస్తే రూ.8.50 లక్షలు ఇస్తామని కొందరు ఆశ చూపారు. దానికి సంబంధించి వినరు కుమార్‌ క్లినికల్‌ పరీక్షలకు, ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆపరేషన్‌కు హాజరయ్యారు. అనంతరం అతనికి రూ.ఐదు లక్షలు ఇచ్చినట్టు చూపించి రూ.2.50 లక్షలు మాత్రమే చెల్లించి మోసం చేశారు. దీంతో బాధితుడు ఏప్రిల్‌ 26న పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వ్యవహారం సాగిందిలా..
కారు డ్రైవర్‌గా పని చేస్తున్న వినరు కుమార్‌తో వాంబే కాలనీకే చెందిన శ్రీను, అతని భార్య కొండమ్మ, కామరాజు, ఎలీనా పరిచయం పెంచుకున్నారు. వారంతా వినరుకుమార్‌ను కిడ్నీ ఇవ్వడానికి ఒప్పించి మహరాణిపేటలో ఉంటున్న నార్ల వెంకటేశ్వరరావుకు పరిచయం చేశారు. ఈ క్రమంలోనే విజయ డయాగస్టిక్‌ సెంటర్‌లో ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శేఖర్‌ తప్పుడు పత్రాలు సృష్టించాడు. క్లినికల్‌ టెస్టులు అక్కడ కొన్ని చేయించాడు. మిగిలిన వాటిని అపోలో ఆస్పత్రిలో చేయించారు. అనంతరం నార్ల వెంకటేశ్వరరావు అనుచరులు రమేష్‌, పవన్‌ గతేడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌ మధ్య కాలంలో పెందుర్తి వద్ద ఉన్న తిరుమల నర్సింగ్‌ హోమ్‌లోని డాక్టర్‌ పరమేశ్వరరావును సంప్రదించారు. ఆస్పత్రిలోని రెండో అంతస్తులో ఉన్న ఆపరేషన్‌ గదిని రూ. 50 వేలకు, వార్డు రూమ్‌ను రూ.10 వేలకు అద్దెకు తీసుకుని అక్కడి సిసి కెమెరాలు పనిచేయకుండా చేశారు. తొలుత పరీక్షల అనంతరం వినరు కుమార్‌ కిడ్నీ ఇచ్చేందుకు విముఖత చూపుతూ హైదరాబాద్‌ వెళ్లిపోగా అతన్ని బెదిరించి బలవంతంగా విశాఖకు రప్పించారు. పెందుర్తి తిరుమల హాస్పిటల్‌లో డిసెంబర్‌ మూడో వారంలో కిడ్నీ మార్పిడి చేశారు. కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న నార్ల వెంకటేశ్వరరావు పరారీలో ఉండగా అతనికి సహకరించిన ఎలీనా, మడక కామరాజు, మర్ర శ్రీను, కొండమ్మ, ల్యాబ్‌ అసిస్టెంట్‌ శేఖర్‌, తిరుమల హాస్పిటల్‌ నిర్వాహకులు డాక్టర్‌ పరమేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడుతో పాటు ఆపరేషన్‌ చేసిన ఇద్దరు డాక్టర్లు, కిడ్నీ పొందిన వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తులను అరెస్ట్‌ చేయనున్నామని పోలీసు కమిషనర్‌ తెలిపారు.