May 18,2023 22:21

రోమ్‌: రోమ్‌ మాస్టర్స్‌ సిరీస్‌-1000 టోర్నీ క్వార్టర్‌ఫైనల్‌ టాప్‌సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ అనూహ్యంగా ఓటమిపాలయ్యాడు. గురువారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ పోటీలో జకోవిచ్‌ 2-6, 6-4, 2-6తేడాతో డెన్మార్క్‌కు చెందిన హోల్గర్‌ రునె చేతిలో పరాజయాన్ని చవిచూశాడు. వర్షం ఆటంకం కలిగించిన కీలక పోరులో 20 ఏళ్ల కుర్రాడి చేతిలో జకోవిచ్‌ ఓటమిపాలవ్వడం గమనార్హం. ఇంతకుముందు మాస్టర్స్‌ 1000 టోర్నీలోనూ (గతేడాది నవంబర్‌లో) జకోను రునె ఓడించి చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు మరోసారి ఇటాలియన్‌ ఓపెన్‌లోనూ ఓడించి పైచేయి సాధించడం విశేషం. దీంతో తొలిసారి జకోవిచ్‌, నాదల్‌ వంటి టాప్‌ ఆటగాళ్లు లేకుండా ఫైనల్‌లో కొత్త ఆటగాళ్లు తలపడే అవకాశం ఉంది. గత కొన్ని వారాలుగా మోచేతి నొప్పితో బాధపడుతున్న జకోవిచ్‌ ఈ టోర్నీలోనూ అలాగే బరిలోకి దిగాడు. పెయిన్‌ కిల్లర్స్‌ వాడుతూ మ్యాచ్‌లను ఆడాడు. జకోవిచ్‌ వరుసగా 17వ సారి ఇటాలియన్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. అయితే, హౌల్గర్‌ రునె మాత్రం అద్భుతమైన ఆటతీరుతో జకోవిచ్‌ను చిత్తుచేశాడు.