Jun 15,2022 10:05

చింతకాని (ఖమ్మం) : అసెంబ్లీ ఎన్నికలు రానున్న వేళ ... వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగబోతున్నారు. రెడ్డి సామాజికవర్గం నాయకులదే ఆధిపత్యంగా ఉన్న పాలేరు నుండి షర్మిల పోటీపడనున్నట్లు ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు, నియోజకవర్గ ఇన్‌చార్జి బీరవెల్లి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

లక్కినేని సుధీర్‌బాబు మాట్లాడుతూ .... పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తుండటంతో ఈ నెల 19 న నేలకొండపల్లిలో పాలేరు నియోజకవర్గ విస్తృ  తస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో మొదటి నుండి కాంగ్రెస్‌కే పట్టు ఉంది. ఇక్కడ రెడ్డి సామాజికవర్గం నాయకులదే ఆధిపత్యంగా కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కందాళ ఉపేందర్‌ రెడ్డి గెలుపొందారు.

ఈ అంశాలన్నీ కలిసొస్తాయని...
గిరిజన ఓటు బ్యాంకు అధికంగా ఉండటం, ఆయా గ్రామ రాజకీయాలు రెడ్డి సామాజికవర్గం నేతల చేతిలో ఉండటం, తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌కు పాలేరు కంచుకోటగా ఉండటం, రాంరెడ్డి వెంకటరెడ్డి మరణానంతరం కాంగ్రెస్‌కు అక్కడ బలమైన నాయకుడు లేకపోవడం లాంటి అంశాలు తమకు కలిసొస్తాయని.. మరోవైపు టిఆర్‌ఎస్‌లోని వర్గ విభేదాలు కూడా లాభిస్తాయన్న ఉద్దేశంతో షర్మిల పాలేరు నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.

కెసిఆర్‌ను మళ్లీ ఎన్నుకుంటే అంధకారమే.. నాకో అవకాశం ఇవ్వండి : షర్మిల
తనకో అవకాశం ఇవ్వాలని వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ... గత మంగళవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో నిర్వహించిన నిరుద్యోగ నిరహార దీక్షలో షర్మిల ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ ... కెసిఆర్‌ ఓ హంతకుడని, నిరుద్యోగుల చావులకు ఆయనే కారణమని ఆరోపించారు. ఉద్యోగ ఖాళీలున్నా భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తమ జీవితాలు బాగుపడతాయని ఎంతో మంది విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు ఉద్యమం చేసి రాష్ట్ర సాధనకు కృషి చేశారన్నారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర ఖజానాను టిఆర్‌ఎస్‌ దోచుకుందని విమర్శించారు. మరోసారి కెసిఆర్‌ను ఎన్నుకుంటే చీకట్లో మగ్గినట్లేనని షర్మిల హెచ్చరించారు.