Dec 03,2022 10:04

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మొన్నటి దాకా కరోనా వైరస్‌ మనుషులను హడలెత్తించిన తరహాలో ఇప్పుడు ఆవులను లంపీ స్కిన్‌ హడలెత్తిస్తోంది. ముఖ్యంగా ఆవులు, ఎద్దులకు వ్యాపిస్తున్న ఈ వైరస్‌తో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉత్తర భారతదేశంలో త్వీరంగా ఉన్న ఈ వ్యాధి రాష్ట్రంలోనూ విజృంభిస్తోంది. దీన్ని కట్టడి చేసేందుకు పశు సంవర్థకశాఖ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పశువులను కాపాడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు డైరెక్టర్‌ అమరేంద్రకుమార్‌ తెలిపారు. లంపీ స్కిన్‌కు కాప్రి వైరస్‌ ప్రధాన కారణమని గుర్తించారు. దోమలు, ఇతర కీటకాల ద్వారా ఒక జంతువు నుంచి మరో జంతువుకూ సోకుతోంది. ఈ వైరస్‌ సోకిన పశువులకు తొలిదశలో శరీరం మొత్తం బుడిపెలు మాదిరి వచ్చి ఆహారం తీసుకోవడం తగ్గించేస్తున్నాయి. జ్వరంతోనూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అలాగే కళ్లు, ముక్కు నుంచి నీరు కారడం, చర్మంపై గుండ్రటి గడ్డల ఏర్పడుతున్నాయి. రెండోదశలో కాళ్ల నొప్పులతో పశువు సరిగా నడవలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఫ్లోరైడ్‌ బారిన పడిన ప్రజలకు ఎలాగైతే కాళ్లు వంగుతాయో లంపి స్కిన్‌ బారిన పడిన పశువుల్లోనూ కాళ్లు ఒంపులు తిరుగుతున్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, పల్నాడు, సత్యసాయి జిల్లాల్లో లంపి స్కిన్‌ వ్యాధిని గుర్తించారు. రాష్ట్రంలో 46 లక్షల ఆవులుంటే 788 పశువులకు లంపిస్కిన్‌ సోకినట్లు అందులో 48 పశువులు మృతి చెందినట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు.
 

                                            ప్రమాదం లేదు.. టీకాలతో నియంత్రణ : డాక్టర్‌ ఆర్‌.అమరేంద్రకుమార్‌

లంపిస్కిన్‌ వ్యాధి అంత పెద్దప్రమాదం కాదని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ సంచాలకులు డాక్టర్‌ ఆర్‌ ఆమరేంద్రకుమార్‌ తెలిపారు. కాప్రి వైరస్‌తో సోకే ఈ వ్యాధి తీవ్రత వారంరోజుల్లో తగ్గిపోతుందని ప్రజాశక్తికి వివరించారు. రాష్ట్రంలో 2019లోనూ ఈ వైరస్‌ సోకిందని, కానీ ఇప్పుడున్నంత తీవ్రత లేదని అన్నారు. ఉత్తర భారతదేశంలోని గుజరాత్‌, రాజస్తాన్‌, ఉత్తరప్రదేశ్‌లో ఈ వ్యాది ఎక్కువ ప్రమాదకరంగా వుందని రాష్ట్రంలో అంత తీవ్రత లేదని వివరించారు. లంపి స్కిన్‌ వ్యాధి నియంత్రణ కోసం గోట్‌పాక్స్‌ వ్యాక్సిన్‌ వేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 71 శాతం ఆవులకు ఈ గోట్‌ పాక్స్‌వ్యాక్సిన్‌ను వేశామని తెలిపారు. రాష్ట్రంలో లంపిస్కిన్‌ నియంత్రణలోనే వుందని రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమరేంద్రకుమార్‌ తెలిపారు.