- వర్షం వస్తే రోడ్డంతా బురదమయం
ప్రజాశక్తి - యంత్రాంగం : చిన్నపాటి వర్షానికే రోడ్లు ఛిద్రమవుతున్నాయని, కలుషిత నీరు తాగలేక అవస్థలు పడుతున్నామని, చెత్త, ఆస్తి పన్నులతో అల్లాడుతున్నామని సిపిఎం నేతల ఎదుట ప్రజలు వాపోయారు. 'జనం కోసం సిపిఎం' కార్యక్రమం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం కొనసాగింది. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను నాయకుల ఎదుట ఏకరువు పెట్టారు.
కుళాయిల్లో మురుగు నీరు వస్తోందని, ఈ నీరు తాగలేక పోతున్నామని నెల్లూరులోని వెంకటేశ్వరపురం విజయపాల డెయిరీ ఎదురుగా ఉన్న 53 డివిజన్ కాలనీ వాసులు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఎదుట వాపోయారు. పక్కనే పెన్నా నది ప్రవహిస్తోన్నా.. మాకు కలుషిత నీరే దిక్కువుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు మంచి నీటి కోసం రూ.20-50 ఖర్చు చేయాల్సి వస్తోందని తమ సమస్యలను ఏకరువు పెట్టారు. తమకు అందుబాటులో ఉన్న బ్యాంకు మరో ప్రాంతానికి తరలించడంతో ప్రయాణ ఖర్చులు భారమవుతున్నాయని వివరించారు. మురుగునీటి సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో మంచినీళ్ల కోసం పోరాటం చేయాల్సి వస్తోందని శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం ఇస్తున్న నగదుతో ఇళ్లను నిర్మించుకోలేమని 54వ డివిజన్ కాలనీ వాసులు తమ సమస్యను తెలిపారు. జగనన్న ఇళ్లను ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అధిక ధరలు, విద్యుత్‌కోతలు, పింఛన్ల కొరత, చెత్త పన్ను, మురుగునీటితో సతమతమవుతున్నామని కావలి, నెల్లూరు, నెల్లూరురూరల్ వాసులు తమ సమస్యలను నాయకుల దృష్టికి తెచ్చారు.
వీధి దీపాలు లేవు
బస్టాండ్ నుంచి ఇందిరమ్మ కాలనీ వరకూ వీధిదీపాలు లేవని..రాత్రి ఏడు గంటల తరువాత రావాలంటే భయం వేస్తుందని తూర్పుగోదావరి జిల్లా చాగల్లు కాలనీ వాసులు వాపోయారు. వర్షం వస్తే రోడ్డు అంతా బురదమయమవుతుందని, కాలనీ ఏర్పడి 14 ఏళ్లయినా నేటికీ డ్రెయినేజీ లేదని తెలిపారు. సిమెంట్ రోడ్లు, కాలువలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జె.ఆర్.పురంలోని వెంకటేశ్వర కాలనీవాసులు సిపిఎం నాయకుల దృష్టికి తెచ్చారు. తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలాస మున్సిపాలిటీ శాంతినగర్ వాసులు తెలిపారు. రోడ్లు ,డ్రెయినేజీ సమస్య ఉందని పలువురు మహిళలు తమ సమస్యలను నాయకుల దృష్టికి తెచ్చారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా సిపిఎం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో జీపుయాత్రను ప్రారంభించారు.
విద్యుత్ సౌకర్యం లేదు
కొండపైనున్న తమకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కొండ దిగువకు రమ్మని అధికారులు చెప్పారని, తీరా వచ్చాక ఇప్పుడు ఇళ్లకు మంజూరు పత్రాలు ఇవ్వడం లేదని విశాఖ నగర పరిధిలోని గోశాల దరి గిరిజన గ్రామ వాసులు తమ సమస్యను సిపిఎం నాయకుల దృష్టికి తెచ్చారు.
విద్యుత్ సౌకర్యం లేదని, కలుషిత నీటితో అవస్థలు పడుతున్నామని తమ గోడు వెలిబుచ్చారు. సెజ్ పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం లేదని అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం హరిపాలెం గ్రామ వాసులు తెలిపారు. మత్స్యకారులకు జెట్టీ నిర్మించాలని, ఎన్‌ఎఒబి నిర్మాణ పనుల్లో స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పించాలని, కుళాయిల ద్వారా తాగునీరు అందించాలని, డ్రెయినేజీలు నిర్మించాలని రాంబిల్లి మండలం కొత్తపట్నం స్థానికులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు.
తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు
ఇంటింటికీ సిపిఎం కార్యాక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహశీల్దార్, సచివాలయాల ఎదుట సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రజలపై పన్నుల భారాలు మోపవద్దని కోరారు. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విశాఖ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, ఎన్‌టిఆర్ జిల్లా, అనంతపురం, కడప, కోనసీమ, శ్రీకాకుళం,పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో నిరసనలు తెలిపారు. అనంతరం అధికారులు వినతిపత్రాలు అందజేశారు.










