Jul 27,2022 09:30
  • కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఎన్యూమరేషన్‌ పూర్తి
  • అధికారిక ప్రకటనపై తాత్సారం

ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి : గోదావరి వరదలకు ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఏడువేల ఇళ్లు దెబ్బతిన్నట్లు లెక్కలు తేలాయి. ఇందులో పూర్తిగా నేలమట్టమైనవే అధికంగా ఉన్నట్లు సమాచారం. గోదావరి వరదలు సృష్టించిన బీభత్సంతో వేల కుటుంబాలకు నిలువ నీడ లేకుండాపోయింది. దీంతో బాధితులు పునరావాస శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి గోదావరికి వరదలు వచ్చాయి. భద్రాచలం వద్ద 71 అడుగుల వరకూ గోదావరి నీటిమట్టం చేరుకోగా.. పోలవరం ఎగువ కాఫర్‌డ్యాం వద్ద దాదాపు 38 మీటర్లకు నీటి మట్టం చేరింది. దాదాపుగా 28లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిపడింది. దీంతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని 151 గ్రామాలు ముంపునకు గురయ్యాయి.దాదాపు అన్ని ఇళ్ల పైకప్పులు మునిగిపోయాయి. ఇంట్లోని సామాన్లతో సహా అన్ని వదిలేసి కట్టుబట్టలతో బాధితులు పునరావాస శిబిరాలకు చేరారు. మూడు రోజుల క్రితం వరద నీరు తగ్గడంతో దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి ఎన్యుమురేషన్‌ ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఇందుకుగాను 21 మంది ఎఇలు, 96 మంది ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లతో కూడిన బృందాలను నియమించారు. ఈ బృందాలు కుక్కునూరు మండలంలో 83, వేలేరుపాడు మండలంలో 68 నివాసిత ప్రాంతాల్లో పర్యటించి ఎన్యుమురేషన్‌ పూర్తిచేశాయి. ఈ రెండు మండలాల్లో కలిపి 17వేల ఇళ్లను పరిశీలన చేసి ఏడువేల ఇళ్లు దెబ్బతిన్నట్లు లెక్కలు తేలాయి. దెబ్బతిన్న పశువుల పాకలను ఎన్యుమురేట్‌ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నపాటి ఇళ్లు నిర్మించుకోవాలన్న రూ.50వేలకు పైగా ఖర్చు అవుతోంది. చేతిలో చిల్లిగవ్వలేక, దిక్కుతోచని పరిస్థితుల్లో ఈ కుటుంబాలన్ని పునరావాస శిబిరాల్లోనే కాలం వెళ్లదీస్తున్నాయి. దెబ్బతిన్న, కుప్పకూలిన ఇళ్లకు సంబంధించి ఎన్యుమురేషన్‌ పూర్తయినప్పటికీ అధికారికంగా లెక్కలు ప్రకటించడం లేదు. దెబ్బతిన్న ఇళ్లకు ఇచ్చే పరిహారానికి సంబంధించి ప్రభుత్వం నేటికీ ప్రకటన చేయలేదు. ప్రభుత్వం సాయం చేస్తే ఇళ్లు నిర్మించుకునేందుకు వరద బాధితులు ఎదురుచూస్తున్నారు. గూడు లేక శిబిరంలోనే
     

గోదావరి వరదకు ఇల్లు, బార్బర్‌ షాప్‌ కుప్పకూలిపోయాయి. బతుకుదెరువుతోపాటు, ఉండేందుకు ఇల్లు లేకుండా పోయింది. ఇల్లు నిర్మించాలంటే పెద్దఎత్తున ఖర్చుకానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లు నిర్మించుకునే స్తోమత లేదు. దీంతో పునరావాస శిబిరంలోనే ఉంటున్నాం.ప్రభుత్వం సాయం చేస్తే ఉండేందుకు గూడు నిర్మించుకుంటాం.
                        - నూజివీటి సత్యనారాయణ, కుక్కునూరు, ఎ-బ్లాక్‌ దిక్కుతోచని పరిస్థితి

కట్టుబట్టలతో కుటుంబమంతా జూనియర్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరానికి చేరాం. పునరావాస శిబిరాన్ని ఖాళీ చేయాలని అధికారులు చెబుతున్నారు. ఇల్లు కూలిపోవడంతో ఉండటానికి చోటులేదు. అద్దె ఇల్లుకూడా దొరకడం లేదు. ఏంచేయాలో దిక్కుతోచడం లేదు.
                                                                                    -షేక్‌ మస్తాన్‌బి, కుక్కునూరు, బి బ్లాక్‌