Aug 02,2022 12:40

న్యూఢిల్లీ : ప్రజల జీవనోపాధిపై బిజెపి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా సెప్టెంబర్‌ 14 నుండి 24 వరకు దేశవ్యాపిత ప్రచారోద్యమం చేపట్టాలని సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. జూలై 30, 31 తేదీలలో న్యూఢిల్లీలో కేంద్ర కమిటీ సమావేశమై తాజా రాజకీయ పరిస్థితిపై చర్చించి ఈ ది క్రింది ప్రకటనను విడుదల చేసింది: సిపిఐ(ఎం) 23వ మహాసభ ముగిసిన తరువాత గత నాలుగు మాసాలుగా నయా-ఉదారవాద విధానాలు, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, మతోన్మాదం వంటి వాటిని దూకుడుగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు, ఫాసిస్ట్‌ ఆరెస్సెస్‌ హిందుత్వ ఎజెండా దూకుడు పెంచడం ఇవన్నీ మన అంచనా సరైనదేనని రుజువు చేస్తున్నాయి. కార్పొరేట్‌ - మతతత్వ శక్తుల పొత్తు భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడమే గాక ప్రజలపై అసాధారణ భారాలను మోపుతోంది.
 

                                                                   కట్టలు తెంచుకున్న ద్రవ్యోల్బణం

టోకుధరలు, వినియోగదారీ ధరల సూచీలు రెండూ రికార్డు స్థాయిలో పెరగడంతో ధరలు చుక్కలనంటుతూ ప్రజల జీవనోపాధిని నాశనం చేస్తున్నాయి. వారి కొనుగోలు శక్తిని తగ్గించేస్తునాయి. ఇది ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ మరింత పడిపోయేలా చేస్తుంది. దేశీయంగా గిరాకీ తగ్గడం వల్ల ఉత్పాదక కార్యకలాపాలు తగ్గుముఖం పడుతున్నాయి, ఇది ఆర్థిక వ్యవస్థ మరింత మాంద్యంలోకి జారుకునేలా చేయడమేగాక, .ఉద్యోగాలు కోల్పోవడానికి కూడా దారితీస్తోంది. ఆహార, ఇంధన ధరలు నిరంతరం పైపైకి ఎగబాకుతుండడంతో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంధన ధరలు ఈ ద్రవ్యోల్బణానికి దారితీస్తున్నాయి. ఇది చాలదన్నట్లు తాజాగా జిఎస్‌టి పెంపుతో రోజువారీ వినియోగానికి సంబంధించిన అన్ని నిత్యావసర వస్తువుల ధరలు మరింతగా పెరిగేందుకు దారి తీసింది. అధిక ధరలకు ఆజ్యం పోసేజిఎస్‌టి పెంపు, పెట్రోలియం ఉత్పత్తులపై సెస్‌/సర్‌చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ డిమాండ్‌ చేస్తుంది. ప్రజలపై భారం మోపే బదులు మోడీ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడానికి అత్యంత సంపన్నులపై పన్ను విధించాలి.
 

                                                                      రికార్డు స్థాయిలో నిరుద్యోగం

20-24 ఏళ్ల మధ్య వయస్కులలో 42 శాతం నిరుద్యోగిత ఉంది. 90 కోట్ల మంది పని చేయగల వయసున్న జనాభాలో (2020 నాటికి ) 61.2 శాతం మంది ఉద్యోగాల కోసం వేట మానేశారు. కార్మిక భాగస్వామ్య రేటు రికార్డు స్థాయిలో పడిపోయింది మోడీ ఎనిమిదేళ్ల పాలనలో . మహిళల పరిస్థితి మరీ దారుణం. 38.8 శాతం-మహిళలు అత్యంత దారుణంగా దెబ్బతిన్నారు. కేవలం 0.33 శాతం దరఖాస్తుదారులకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు మోదీ ప్రభుత్వం పార్లమెంటులో అంగీకరించింది. ఇప్పటికీ పది లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయి. మోడీ ప్రభుత్వం తక్షణమే అన్ని ఖాళీలను భర్తీ చేయాలి. జాతీయ ఉపాధి హామీ కోసం కేటాయింపులను గణనీయంగా పెంచాలి మరియు మన యువత మరియు జనాభా డివిడెండ్‌ను వధా చేయడం ఆపాలి.
 

                                                                    గిరిజనుల హక్కులపై దాడులు

గ్రామసభలు, గిరిజన సమాజం, ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల హక్కులను తొలగించేలా అటవీ సంరక్షణ చట్ట నిబంధనలకు తెచ్చిన సవరణలను వెంటనే వెనిక్క తీసుకోవాలని కేంద్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ప్రైవేట్‌ కార్పొరేట్లకు గరిష్ట లాభాలు చేకూర్చేందుకు అటవీ భూములను మళ్లించడానికి ముందు గిరిజనుల ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తున్న నిబంధనలకు తూట్టు పొడుస్తోంది. ఈ చర్య అడవుల విధ్వంసం వాతావరణ మార్పులపై మరింత వినాశకరమైన ప్రభావం కలుగజేస్తుంది.
 

                                                                            కేరళ పరిణామాలు

కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయడాన్ని కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం , సిఎంను లక్ష్యంగా చేసుకుని రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతత్వంలోని యుడిఎఫ్‌ వరుస ఆందోళనలను చేపడుతోంది. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అది బిజెపితో జతకడుతున్నది.
    సెంట్రల్‌ పూల్‌ ఆదాయంలో తన చట్టబద్ధమైన వాటాను కేరళకు ఇవ్వడానికి తిరస్కరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వివక్షాపూరిత వైఖరిని, వ్యూహాలను కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది, ఇది తీవ్రమైన వనరుల కొరతవైపు కేరళను నెడుతోంది. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం , దాని ప్రత్యామ్నాయ ప్రజా అనుకూల విధానాలకు మద్దతుగా దేశవ్యాప్త ప్రచారాన్ని నిర్వహించాలని, ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ అనుచిత జోక్యాన్ని,, వివక్షాపూరిత వైఖరిని ఖండించాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.
 

                                                                        త్రిపుర పరిణామాలు

బిజెపి త్రిపురలో తన రాష్ట్ర ప్రభుత్వాన్ని సాధనంగా చేసుకుని ప్రజలపైన ముఖ్యంగా త్రిపురలో సిపిఐ(ఎం) , దాని కార్యకర్తలపైన చేస్తున్న ఫాసిస్ట్‌ దాడులను కేంద్ర కమిటీ ఖండించింది. మరికొద్ది నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నందున బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చింది. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ప్రజలను నిరోధించేందుకు భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. బిజెపి ప్రభుత్వం , దాని భయానక రాజకీయాలు , మత సమీకరణ రాజకీయాలకు వ్యతిరేకంగా లౌకిక శక్తులను పెద్దయెత్తున సమీకరించేందుకు ప్రచారాందోళన చేపట్టాలని (సిపిఐ(ఎం) నిర్ణయించింది.
 

                                                                         బెంగాల్‌ పరిణామాలు

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వంలో మొత్రి, టిఎంసిలో మైన వ్యక్తి అయిన పార్థ ఛటర్జీ ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో అరెసు కావడం టిఎంసి ప్రభుత్వ హయాంలో హింసాత్మక రాజకీయాలతోబాటు అవినీతి ఎంత తీవ్రస్థాయిలో వేళ్లూనుకున్నదో తెలియజేస్తోంది. మంత్రి అరెస్టు నేపథ్యంలో ఆయనను తొలగించక తప్పలేదు.ఈ ఉదంతం టీఎంసీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక స్వభావాన్ని మరోసారి తేటతెల్లం చేసింది. నారద, శారద, మునుపటి చిట్‌ ఫండ్‌ స్కామ్‌లు మోడీ ప్రభుత్వ హయాంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తును కొనసాగించడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. రాష్ట్రంలో సిపిఐ(ఎం), లెఫ్ట్‌ ఫ్రంట్‌లు పభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చేపట్టిన నిరసన కార్యక్రమాలకు ప్రజల మద్దతు కూడా లభిస్తున్నది.

                                                                       పూర్తి స్థాయి నిరంకుశత్వం

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడంలో, ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడంలో ఇడి, సిబిఐలు మోడీ ప్రభుత్వానికి రాజకీయ సాధానాలుగా పని చేస్తున్నాయి. . కొంతకాలం తర్వాత పదవీ విరమణ చేయనున్న ఒక న్యాయమూర్తి నేతత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్‌ ఇటీవలి ఇచ్చిన తీర్పు, పిఎంఎల్‌ఎకి 2019లో తెచ్చిన సవరణలను సమర్థించింది. తద్వారా దీనిని మరింత ప్రాణాంతకమైన సాధనంగా చేస్తున్నది. ప్రజాస్వామ్యంపై ఇది ఘోరమైన దాడి అని కేంద్ర కమిటీ పేర్కొంది.

పార్లమెంట్‌పై దాడి : ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి ముఖ్యమైన ప్రజల సమస్యలపై ఎలాంటి కీలక తీర్మానాన్ని చర్చకు అనుమతించకుండా మోదీ ప్రభుత్వం చేపట్టిన వైఖరి పార్లమెంట్‌పై అసాధారణమైన దాడిగా కేంద్ర కమిటీ పేర్కొంది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో 27 మంది ఎంపీలను సస్పెండ్‌ చేయడం స్వతంత్ర భారతదేశంలో కని విని ఎరుగని దారుణం. మానవ హక్కులు, పౌర హక్కుల కోసం గట్టిగా పోరాడుతూ, మతతత్వానికి వ్యతిరేకంగా సాహసోపేతమైన వైఖరి తీసుకున్న తీస్తా సెతల్వాద్‌ను అరెస్టు చేసిన తీరును కేంద్ర కమిటీ ఖండిస్తోంది. మళ్లీ అదే న్యాయమూర్తి నేతత్వంలోని ధర్మాసనం ఆమె అరెస్టును ప్రేరేపించే విధంగా తీర్పు ఇచ్చింది. జుబేర్‌ అహ్మద్‌ను అహేతుకమైన కారణాలతో అరెస్టు చేసిన తీరు చూస్తుంటే మోడీ ప్రభుత్వ హయాంలో హింసకు దారితీసే ద్వేషపూరిత ప్రసంగాలను ప్రోత్సహించేవారికి, హింసను రెచ్చగొట్టేవారికి ప్రభుత్వ రక్షణ ఉంటుందని, ఆ విద్వేష ప్రసంగాల బండారాన్ని బట్టబయలు చేసి, ప్రజల ముందు నిజాలు ఉంచేవారు కటకటాల వెనక ఉండాల్సి వస్తుందని మోడీ సర్కార్‌ చెప్పదలచుకున్నట్లుగా ఉంది. భీమా కోరేగావ్‌ ఖైదీలు మూడేళ్లుగా జైల్లో మగ్గుతున్నారు. క్రూరమైన నిర్బంధ చట్టాల కింద జర్నలిస్టులు, విద్యార్థులతో సహా అనేక మంది నిర్బంధించబడ్డారు. తీస్తా సెతల్వాద్‌, ఆర్‌బి శ్రీకుమార్‌, భీమా కోరేగావ్‌ నిర్బంధంలో ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని కేంద్ర కమిటీ డిమాండ్‌ చేసింది.

                                                            మతతత్వ సమీకరణతో పొంచి ఉన్న ముప్పు

అనేక రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు, మైనారిటీ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని, అధికార పార్టీ ఆధ్వర్యంలో హిందుత్వ సంస్థలు మత సమీకరణ కోసం దాడులు, బెదిరింపులతో పెట్రేగుతుండడాన్ని కేంద్ర కమిటీ ఖండిస్తోంది. ఢిల్లీ, ఇతర బిజెపి పాలిత రాష్ట్రాలలో పెద్ద ఎత్తున బుల్డోజర్‌ రాజకీయాలను మోహరించడం మతపరమైన సమీకరణలకు మరింత పదును పెట్టింది. మన లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర శిథిలాలపై హిందూత్వ రాష్ట్ర లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజల్లో హిందుత్వను రెచ్చగొట్టేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌/బిజెపి యత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే ద్వేషం, హింస, విషపూరిత ప్రచారం చేస్తూ హింసను రెచ్చగొడుతున్నాయి.
        కొత్త పార్లమెంట్‌ భవనం పైన జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరిస్తున్న సమయంలో ప్రధానమంత్రి హిందూ మతపరమైన ఆచారాన్ని నిర్వహించడం ద్వారా భారత గణతంత్ర రాజ్యంపై దాడి మరోసారి స్పష్టమైంది. ఇది భారత రాజ్యం, ప్రభుత్వాన్ని హిందూత్వకు ప్రతీకగా ఉంటున్నదే తప్ప భారత రాజ్యాంగంతో ఉండడం లేదు. భారత రాజ్యాంగం, లౌకిక ప్రజాస్వామ్యం , మన ప్రజల ప్రజాస్వామిక హక్కులు, పౌర స్వేచ్ఛల హామీని రక్షించుకునేందుకు కలసికట్టుగా అందరూ ఉద్యమించాలని లౌకిక భావాలు గల వ్యక్తులు శక్తులందరికీ కేంద్ర కమిటీ విజ్ఞప్తి చేసింది.

                                                                        కేంద్ర కమిటీ పిలుపు

1. ఆగస్టు 1-15 ప్రచారోద్యమం భారతదేశ స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, అన్ని పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేయడం, రాజ్యాంగ పీఠికపై ప్రతిజ్ఞ చేయడంతో ముగుస్తుంది. స్వాతంత్య్ర పోరాటం, ప్రజాస్వామ్య రక్షణ, ప్రజాస్వామ్య హక్కులు, పౌర స్వేచ్ఛ, భారతదేశ లౌకిక, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు కమ్యూనిస్టుల అద్భుతమైన పాత్ర గురించి ప్రధానంగా ప్రస్తావించింది.
2. ప్రజల జీవనోపాధిపై బిజెపి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా సెప్టెంబర్‌ 14 నుండి 24 వరకు ప్రచారోద్యమం నిర్వహించాలి., ప్రతి రాష్ట్రంలో నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర కమిటీలు రూపొందించాలి. . ఈ ప్రచారం కేంద్ర బహిరంగ సభ, రాష్ట్ర రాజధానులల్లో సభలతో, ముగుస్తుంది
3. కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించాలి. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజానుకూల ప్రత్యామ్నాయ విధానాలను ఈ ప్రచారంలో హైలైట్‌ చేయాలి.