ప్రొ.హరగోపాల్ తదితరులపై పెట్టిన దేశద్రోహం కేసును (ఉపా) ఉపసంహరించుకోవాలి : వామపక్షాలు డిమాండ్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : నిరంతరం ప్రజా సమస్యలపై స్పందిస్తూ, ప్రభుత్వానికి సరైన సూచనలు చేస్తూ, అభ్యుదయ భావాలతో రాష్ట్ర, దేశ అభివృద్ధికి కృషి చేస్తున్న పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌కు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే నెపంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశద్రోహం కేసును బనాయించడాన్ని వామపక్ష పార్టీలు ఖండించాయి. తక్షణమే ఈ కేసును ఉపసంహరించుకోవాలని ఆ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఐఎంఎల్ న్యూడెమొక్రసీ నాయకులు వై సాంబశివరావు, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సిపిఐఎంఎల్ నాయకులు జాస్తి కిషోర్‌బాబు, ఎంసిపిఐయు నాయకులు కాటం నాగభూషణం, సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు మూర్తి, ఎస్‌యుసిఐసి నాయకులు అమర్‌నాథ్, ఫార్వార్డ్ బ్లాక్ నాయకులు సుందరరామరాజు, ఆర్‌ఎస్‌పి నాయకులు జానకిరాములు శుక్రవారం ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశారు. ప్రొఫెసర్‌గా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి రిటైర్డ్ అయిన తరువాత కూడా ప్రొఫెసర్ హరగోపాల్ ప్రజాసేవలో వున్నారని తెలిపారు. ఉపాధి, తాగునీరు, భూ సమస్యలు, దళిత, గిరిజనులపై దాడులు తదితర అంశాలపై స్పందిస్తూ సమావేశాలు, సెమినార్లు పెడుతూ ప్రభుత్వం దృష్టికి తెచ్చి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ప్రసాద్‌తో 50 మంది మావోయిస్టులు సమావేశమైనట్లు ప్రకటించి, 44వ వ్యక్తిగా హరగోపాల్ పేరు చేర్చి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఈ సమావేశంలో చర్చించారనే నెపంతో 150 మందిపై దేశద్రోహం కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేశారని డైరీల్లో పేర్లు ఉన్నాయని దేశద్రోహం కింద కేసులు నమోదు చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు అభిశంసించిన దేశద్రోహ చట్టాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్, ఇతరులపై పెట్టిన దేశద్రోహం కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రజలు, ప్రజాతంత్రవాదులు, మేధావులు ప్రభుత్వ చర్యను నిరసించాలని వామపక్ష పార్టీలు కోరాయి.










