కోల్‌కతా : రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ ఛాంపియన్‌గా సౌరాష్ట్ర అవతరించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర.. బెంగాల్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌరాష్ట్ర.. తొలుత బెంగాల్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఉనద్కత్ (3/44), చేతన్ సకారియా (3/33), చిరాగ్ జానీ (2/33), డి జడేజా (2/19) చెలరేగడంతో బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే కుప్పకూలింది. షాబాజ్ ఆహ్మద్ (69), అభిషేక్ పోరెల్ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో బెంగాల్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర.. హార్విక్ దేశారు (50), షెల్డన్ జాక్సన్ (59), వసవద (81), చిరాగ్ జానీ (60) అర్ధసెంచరీలతో రాణించడంతో 404 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. బెంగాల్ బౌలర్లలో ముకేశ్ కుమార్ 4, ఆకాశ్‌దీప్, ఇషాన్ పోరెల్ తలో 3 వికెట్లు పడగొట్టారు.
230 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 241 పరుగులకే ఆలౌటైంది. మజుందార్ (61), మనోజ్ తివారి (68) అర్ధసెంచరీలతో రాణించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఉనద్కత్ (6/85), సకారియా (3/76) బెంగాల్‌ను మట్టికరిపించారు. 12 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన సౌరాష్ట్ర.. వికెట్ నష్టానికి 14 పరుగులు చేసి రంజీ ఛాంపియన్‌గా అవతరించింది.
గత మూడో సీజన్లలో ఈ జట్టు ఛాంపియన్‌గా నిలవడం ఇది రెండో సారి. 2019-20 సీజన్‌లో సైతం జయదేవ్ ఉనద్కత్ సారధ్యంలో సౌరాష్ట్ర దేశవాలీ ఛాంపియన్‌గా నిలిచింది.










