ప్రజాశక్తి- దేవనకొండ/కర్నూలు కార్పొరేషన్:ఎస్‌ఎఫ్‌ఐ తొలి తరం నాయకులు, కర్నూలు జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కె.వెంకటరామిరెడ్డి (89) ఆదివారం కర్నూలులో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య సరస్వతి, కుమారులు ప్రకాష్‌రెడ్డి, రవీంద్రారెడ్డి ఉన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామానికి చెందిన పెద్ద లక్ష్మిరెడ్డి, హనుమంతమ్మలకు వెంకటరామిరెడ్డి 1935 జులై 1న జన్మించారు. తిరుపతిలో డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఇంగ్లీషులో పీజీ చేశారు. చిత్తూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా కొంతకాలం పని చేశారు. ఆ తర్వాత కర్నూలు ఉస్మానియా కళాశాలలో ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్‌లో లెక్చరర్‌గా చేరారు. ఇక్కడే రిటైర్డ్ అయ్యారు. విద్యార్థి దశలోనే ఆయన కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. ఉస్మానియా కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేస్తూనే జిల్లాలో సిపిఎం ఉద్యమాభివృద్ధికి కఅషి చేశారు. తిరువనంతపురంలో 1970 డిసెంబర్‌లో జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా మొట్టమొదటి సమావేశంలో ఆయన పాల్గన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ వ్యవస్థాపకులలో ఆయన ఒకరు. ఆయన భార్య సరస్వతి కూడా పట్టభద్రురాలు. ధనిక కుటుంబంలో పుట్టినప్పటికీ ఆయనతో వివాహమైనప్పటి నుండి కమ్యూనిస్టు భావాలను కలిగి ఉండేవారు. ఉద్యమాల సందర్భంగా కమ్యూనిస్టు నాయకులు జిల్లాకు వచ్చినప్పుడు వారి ఇంట్లోనే ఆతిథ్యం పొందేవారు. పత్తికొండ ఎమ్మెల్యే ఎర్రగుడి ఈశ్వర్‌రెడ్డి సిసిఎం తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వెంకట్రామిరెడ్డి కుటుంబం ఆయన గెలుపునకు కృషి చేసింది. వెంకటరామిరెడ్డి భౌతికకాయానికి సోమవారం కర్నూలులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వెంకట్రామిరెడ్డి మృతికి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్ సంతాపం తెలిపారు. ఆయన మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. సంతాపం తెలిపిన వారిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్‌రెడ్డి, సిపిఎం కర్నూలు జిల్లా కార్యదర్శి గౌస్ దేశారు, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.నిర్మల, తదితరులు ఉన్నారు.










