ప్రజాశక్తి-నందిగామ : నందిగామ పాతబస్టాండ్ స్కూల్ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి గోపి నాయక్ మాట్లాడుతూ.. నూతన జాతీయ విద్యావిధానం పేరుతో పాఠశాలల విలీనం చేయవద్దన్నారు. ప్రాధమిక పాఠశాలల్లో 3,4,5 తరగతులను కిలో మీటరు దూరంలో ఉన్న ప్రాధమికోన్నత, జడ్‌పి హైస్కూల్లో, అలాగే ప్రాధమికోన్నత పాఠశాలల్లోని 6,7,8 తరగతుల్లో 100లోపు విద్యార్ధులు ఉంటే 3 కి.మీ. దూరంలో ఉన్న హైసూళ్లలో విలీనం చేయడం దారుణం అన్నారు. నాడు - నేడు పేరుతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం చివరికి చదువే లేకుండా చేస్తుందన్నారు. జీవో నెంబర్117 నీ వెంటనె రద్దు చేసి యధావిధిగా కొనసాగించాలన్నారు. లేని పక్షంలో విద్యార్థిని తల్లిదండ్రులు కలుపుకొని వివిధ ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నందిగామ మండల కార్యదర్శి కే గోపాల్, ప్రజా సంఘాల నాయకులు సయ్యద్ కాసిం, తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.











