Jun 29,2022 07:39

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో- ఉద్యోగుల జిపిఎఫ్‌ ఖాతాల్లోని సొమ్ము వారికి తెలియకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించింది. 1.7.2018 తరువాత బకాయి ఉన్న పెండింగ్‌ డిఏల్లో ఒక డిఏ బకాయిని రాష్ట్ర ప్రభుత్వం ఐదు విడతలుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసింది. తాజాగా ఆ మొత్తాన్ని ఒకేసారి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. జిపిఎఫ్‌ స్లిప్పులను కొందరు మంగళవారం డౌన్‌లోడ్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో కలకం రేగింది. పలు సంఘాలు ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించాయి. రాష్ట్రంలో ఉన్న 4.20 లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వ చర్య ద్వారా బాధితులగా మారారని, ఇలా అనుమతి లేకుండా విత్‌ డ్రా చేసిన మొత్తం రూ.800 కోట్ల పైనే ఉంటుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఖాతాల్లో సొమ్ము మాయం కావడంపై పోలీసు కేసులు పెట్టడానికీ సంఘాలు సిద్ధమౌతున్నాయి. గతేడాది మార్చిలోనూ ఇలాగే ఒక విడత సొమ్మును ప్రభుత్వం మళ్ళించిన సంగతి తెలిసిందే. తాజాగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉద్యోగులకు తెలియ కుండానే వారి ఖాతాల నుండి ప్రభుత్వం సొమ్మును వెనక్కి తీసుకుంది. ఇపిఎఫ్‌పై లోను ఇవ్వాలని ఉద్యోగులు ఎప్పటి నుండో దరఖాస్తులు చేసుకుం టున్నా ప్రభుత్వం స్పందించడం లేదు.. కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరుకు మార్చి నెలలో రూ.59,038 విత్‌డ్రా చేసినట్లు తాజాగా రశీదు వచ్చింది. పిహెచ్‌సిలో పనిచేసేమెడికల్‌ అఫీసర్‌కు రూ.88,726, మరో అధికారికి ఫిబ్రవరిలో రూ.1,34,000, మార్చిలో రూ.64,907 వారికి తెలియకుండానే విత్‌ డ్రా అయ్యింది. సిఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థ వచ్చిన తరువాత ప్రతి ఒక్కరి ఆర్థిక లావాదేవీలను ప్రభుత్వం నియంత్రిస్తోంది.
 

                                            అధికారులపై చర్యల తీసుకోవాలి : యుటిఎఫ్‌

ఉద్యోగ, ఉపాధ్యాయుల ఖాతాల్లో నిల్వ ఉన్న సొమ్మును వారి ప్రమేయం లేకుండా డ్రా చేయడం ఆందోళనకరమని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు తెలిపారు. గత ఏడాది కాలంగా ఆర్థిక సమస్యలు కారణంగా చూపి లోన్లు కూడా మంజూరు చేయని ప్రభుత్వం ఇప్పుడు డ్రా చేసినట్లు వార్తలు వస్తున్నాయని, అదే నిజమైతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండు చేశారు. డ్రా చేసిన సొమ్మును వారి ఖాతాల్లో తిరిగి జమచేయాలని కోరారు.
 

                                                      చట్ట విరుద్ధం : సూర్యనారాయణ

ప్రభుత్వ ఉద్యోగుల అనుమతి లేకుండా జిపిఎఫ్‌ ఖాతాల నుంచి ఉపసంహరణ చేయడాన్ని ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్‌ సూర్యనారాయణ తప్పుపట్టారు. ఇందుకు సంబందించి ఆర్దికశాఖ, సిఎఫ్‌ఎంఎస్‌ అధికారులపై సిబిసిఐడి చేత విచారణ చేయించాలని ఆయన డిమాండ్‌ శారు.
 

                                                              అన్యాయం : బొప్పరాజు

ఉద్యోగుల సొమ్ము డ్రా చేసుకోవడం అన్యాయమని ఎపి జెఎసి అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. దీనిపై గతంలో జరిగిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలోనూ ఉద్యోగులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని, పరిశీలిస్తామని చెప్పి మరలా అదే పని చేయడం అన్యాయమని తెలిపారు.
 

                                                              బాధాకరం : ఎస్‌టియు

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ,పెన్షనర్ల భవిష్యనిధి ఖాతాల నుంచి రూ.800 కోట్ల రూపా యలు డ్రా చేసుకుని దారి మళ్లించడం బాధాకరమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయి శ్రీనివాస్‌, హెచ్‌ తిమ్మన్న విమర్శించారు. తక్షణమే రూ.800 కోట్లు ఉద్యోగస్తుల ఖాతాల్లో జమ చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు. ప్రభుత్వ చర్యను బిటిఏ నాయకులు శరత్‌చంద్ర, నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ, మాగంటి శ్రీనివాస్‌, తెలుగునాడు ఉపాధ్యాయసంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్‌, శ్రీరామశెట్టి వెంకటేశ్వరు, ఎపి ఎన్‌జిఓ నాయకులు బండి శ్రీనివాస్‌, శివారెడ్డి తదితరులు ఖండించారు.