- కొత్త జిల్లాలకు అధికారులు, ఉద్యోగుల కేటాయింపు
- త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు !
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అటవీ శాఖలో పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ జరుగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ ఉండబోతుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను అటవీశాఖ త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది. అటవీశాఖలో కొత్త డివిజన్లు, జిల్లాల సరిహద్దులు, అధికారుల నియామకం, ఉద్యోగుల కేటాయింపు వంటి అంశాలపై కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం జిల్లాకు ముగ్గురు డిఎఫ్‌ఒలు ఉన్నారు. అటవీ ప్రాంతానికి ఒకరు, సామాజిక అడవుల విభాగానికి ఒకరు, స్క్వాడ్ విభాగానికి మరొకరు చొప్పున డిఎఫ్‌ఒలు ఉన్నారు. మూడు జిల్లాలకు కలిపి రీజనల్ విజిలెన్స్ అధికారి ఒకరు ఉన్నారు. అయితే పునర్ వ్యవస్థీకరణలో ఈ నాలుగు పోస్టులను కొనసాగించాలా? లేదా అనే అంశంపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఈ అంశంపైనే తీవ్రమైన కసరత్తు జరుగుతుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాల సరిహద్దులపై కూడా కసరత్తు జరుగుతోంది. కొన్ని జిల్లాల్లో అటవీ విస్తీర్ణం లేకపోవడం, కొన్ని జిల్లాల్లో ఎక్కువగా వంటి అంశాలు కూడా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు వంటి జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉంటే.. గుంటూరు, భీమవరం వంటి జిల్లాల్లో అటవీ విస్తీర్ణం చాలా తక్కువగా ఉంది. గుంటూరు జిల్లా నుంచి పల్నాడు, బాపట్ల జిల్లాలు కొత్తగా ఏర్పాడ్డాయి. వీటిల్లో ఒక్క పల్నాడులో మాత్రమే అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉంది. గుంటూరు, బాపట్లలో తక్కువగా ఉంది. ఈ జిల్లాల్లో కేవలం సామాజిక అడవులు మాత్రమే ఉన్నాయి. భీమవరం, కొనసీమ జిల్లాల్లో కూడా సామాజిక అడవులు ఉన్నాయి. జిల్లాల సరిహద్దుల కసరత్తు కూడా తర్వలో పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనలు వెళ్తాయని, ప్రభుత్వం ఆమోదిస్తే జిల్లాల వారీ గెజిట్ నోటిఫికేషన్లు విడుదలవుతాయని తెలిపారు. సెప్టెంబరులోపు ఈ ప్రక్రియ పూర్తవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మంగళగిరికి అరణ్య భవన్
అటవీశాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయం అరణ్య భవన్ గుంటూరు జిల్లాలోని మంగళగిరికి రానుంది. మంగళగిరిలో ఉన్న ఎపిఐఐసి భవనం వద్ద కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అద్దె చెల్లింపు అంశంపై ఆర్థికశాఖతో అటవీశాఖ చర్చలు జరుపుతోంది. రాష్ట్ర విభజన తరువాత గుంటూరులోని జిల్లా అటవీశాఖ కార్యాలయంలో అరణ్య భవన్ ఏర్పాటైంది. అక్కడి నుంచి సచివాలయానికి రావాలంటే ఇబ్బందిగా ఉంఞటుందని అధికారులు చెబుతున్నారు. అందువల్ల కార్యాలయం మంగళగిరికి తరలించాలని నిర్ణయం తీసుకున్నారు.










