Jul 31,2022 20:39

ప్రజాశక్తి - విజయపురిసౌత్‌ (పల్నాడు జిల్లా) : తుపాన్లు వచ్చే నాటికి రైతుల పంట ఇంటికి చేరాలన్న ఉద్దేశంతో కాలువలకు నీటిని ముందుగానే విడుదల చేస్తున్నామని రాష్ట్ర జలనవరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నాగార్జున సాగర్‌ కుడి కాలువ నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని, జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తికి మరో 500 క్యూసెక్కుల నీటిని ఆదివారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరద ఉధృతి దృష్ట్యా పులిచింతల ప్రాజెక్టుకు నష్టం జరగకుండా అవసరమైన మేరకు ఒక గేటు ద్వారా నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం 312 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 220 టిఎంసిలకు చేరిందని, రానున్న రోజుల్లో పూర్తి సామర్థ్యానికి నీటి నిల్వ చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మిగతా అన్ని జలాశయాల్లో నీరు సమృద్ధిగానే ఉందని తెలిపారు. రాష్ట్రంలోని మూడు ప్రాజెక్టుల ద్వారా నిరంతరాయంగా విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుండడం శుభపరిణామం అన్నారు. కార్యక్రమంలో పల్నాడు కలెక్టర్‌ శివశంకర్‌, నీటిపారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ మురళీధర్‌రెడ్డి, ఎస్‌ఇ వరలక్ష్మి, ఇఇ శ్రీహరి, జెన్‌కో ఇఇ వైఎస్‌ఆర్‌కె ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.