- నిరుటి కంటే 27 శాతం తక్కువ
- రాష్ట్రంలోనూ అదే ధోరణి
- డీజిల్, ఎరువుల ధరలే కారణం
- మెరుగైన ఎంఎస్‌పి లేమి
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : దేశ వ్యాప్తంగా ఖరీఫ్ వరి సాగులో తగ్గుదల కనిపిస్తోంది. జూలై 1 నాటికి నిరుటి కంటే ఈ ఏట 27 శాతం తక్కువ విస్తీర్ణంలో నాట్లు పడ్డాయి. ఈ పరిస్థితి ధాన్యాగారంగా, అన్నపూర్ణగా అభివర్ణించే ఆంధ్రప్రదేశ్‌లోనూ నెలకొంది. వరి సేద్యం పట్ల రైతులు అంతగా ఆసక్తి చూపకపోవడానికి బహుళ కారణాలే ఉన్నాయి. ఈ కాలంలో ఎరువుల ధరల పెరుగుదల, అదనుకు కావాల్సిన ఎరువులు దొరక్క పోవడం, ధాన్యానికి మెరుగైన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ప్రకటించకపోవడం, డీజిల్ ధరలతో ఖర్చులు అధికం కావడం వలన అన్నదాతలు వరి సాగుపై నిర్లిప్తంగా ఉన్నారన్నది రైతులు, రైతు సంఘాల, నిపుణుల అభిప్రాయం. ఈ ధోరణి స్థిరపడితే ప్రజల ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇటీవలే కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయల్, రైతులతో వరి సాగును రాష్ట్రాలు ప్రోత్సహించాలని, వీలైన మేరకు విస్తీర్ణాన్ని పెంచాలని చెప్పగా, ఆదిలోనే సాగు తగ్గుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. జులై ఒకటి నాటికి దేశ వ్యాప్తంగా 43.45 లక్షల హెక్టార్లలో వరి నాట్లు పడ్డాయని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. గతేడాది ఇదే సమయానికి 59.56 లక్షల హెక్టార్లలో నాట్లు పడ్డాయి. నిరుటి కంటే 16.11 లక్షల హెక్టార్లలో (27.05 శాతం) వరి నాట్లు తగ్గాయి. కాగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ భిన్నంగా స్పందిస్తోంది. ఇంకా ఉత్తరాదిలో రుతుపవనాలు చురుకుగా లేవని, ఇలాంటి సందర్భంలో వరి సాగు తగ్గుదలపై అప్పుడే స్పష్టమైన నిర్ధారణకు రాలేమని, అయినప్పటికీ పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెబుతోంది.
కేంద్ర నిర్వహణ లోపం
వరి సాగుకు డిఎపి, ఎంఒపి, ఎన్-పి-కె ఎరువులు అవసరం కాగా వీటి ధరలు విపరీతంగా పెరిగాయి. దేశంలో ఏడెనిమిది మాసాలుగా ఎరువుల సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. లభ్యత సరిగ్గా లేదు. డిఎపి, పొటాష్ కొరత తీవ్రంగా ఉంది. సమ యానికి సరిపడా సరఫరా లేకపోవడంతో బ్లాక్ మార్కెట్ తలెత్తింది. ఈ సమస్యలతో రైతులు వరి వేయలేకపోతున్నారు. ఎరువుల ధరలు తగ్గించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎరువుల రేట్ల పెరుగు దలకు అంతర్జాతీయ విపణిని కేంద్రం సాకుగా చూపిస్తోంది. భారీ సబ్సిడీలతో ధరలను నియంత్రి స్తున్నామంటూ వైఫల్యాన్ని సమర్ధించుకుంటోంది.
ఎపిలోనూ అంతే
మన రాష్ట్రంలోనూ వరి నాట్లు తగ్గాయి. జులై 6 నాటికి 1.74 లక్షల హెక్టార్లలో పడాల్సి ఉండగా 90 వేల హెక్టార్లలోనే వేశారు. ఇదే సమయానికి ముందటేడు 1.99 లక్షల హెక్టార్లలో పడగా నిరుడు 1.14 లక్షల హెక్టార్లలో వేశారు. ఖరీఫ్‌లో వరి సాగు లక్ష్యం 16.30 లక్షల హెక్టార్లు. నిరుడు ఖరీఫ్‌లో అంత విస్తీర్ణంలో సాగైంది. కాగా సాధారణ విస్తీర్ణం 15.59 లక్షల హెక్టార్లుగా పేర్కొన్నారు. ఈ మారు ఏడాదికి మూడు పంటలని, వేసవి పంటలని, తుపాన్ల నష్టాన్ని అధిగమించేందుకు ముందస్తుగా డెల్టా కాల్వలకు నీళ్లని ప్రభుత్వం చెప్పగా వరి సాగులో జాప్యం నెలకొంది. నిరుడు ఖరీఫ్‌లో విపత్తుల వలన దిగుబడి బాగా తగ్గింది. తొలుత హెక్టారుకు 4,933 కిలోల ఉత్పాదకతను ఆశించగా చివరికొచ్చేసరికి 4,351 కిలోలకు ఉత్పాదకత పడిపోయింది. ఆ వారా ముందుగా వేసిన ఉత్పత్తి అంచనా 80.46 లక్షల టన్నుల నుండి 70.96 లక్షల టన్నులకు తగ్గింది. దాదాపు పది లక్షల టన్నులు తగ్గాయి. రబీలో బోర్లు, లిఫ్టులు, కృష్ణా డెల్టాలో వరి సాగును నియంత్రించడంతో విస్తీర్ణం మునుపటి రబీ కంటే రెండు లక్షల హెక్టార్లలో తగ్గింది. మరోవైపు ఖరీఫ్, రబీలో ప్రభుత్వ ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా జరగలేదు. ఇ-క్రాప్ వంటి నిబంధనలతో రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు ఎంఎస్‌పి కంటే తక్కువకు వ్యాపారులు, దళారులకు తెగనమ్ముకొని నష్టపోయారు. ఇప్పటికీ చాలా చోట్ల ఖరీఫ్, రబీలో కొన్న ధాన్యానికి ప్రభుత్వం నుండి డబ్బులు రాలేదు. ఆర్‌బికెలన్నప్పటికీ ఎరువుల కొరత, బ్లాక్ మార్కెటింగ్‌తో రైతులు ఇబ్బందులెదుర్కొంటూనే ఉన్నారు. ఆ ప్రభావం వరి సాగుపై పడిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఆహారభద్రత, రాష్ట్ర ఆనవాయితీ, రైతుల ఆదాయానికి కనీస గ్యారంటీ ఇచ్చే వరి సాగును ప్రభుత్వం విరివిగా ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.










