విజయనగరం : నేడు విజయనగరంలో సిఎం జగన్ పర్యటన ఉన్న నేపథ్యంలో .... జిల్లా కేంద్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఒకవైపు చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా టిడిపి నేతలు రిలే నిరసన దీక్షలు కొనసాగిస్తుండగా.... మరోవైపు వైసిపి శ్రేణులు సిఎం జగన్ పర్యటనను స్వాగతిస్తూ ర్యాలీలు చేపట్టి టిడిపిపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. జిల్లాలో 144 సెక్షన్ ఉందంటూ ... ఇలా వైసిపి ర్యాలీలను ఎలా అనుమతిస్తారంటూ టిడిపి నేతలు మండిపడుతున్నారు. వైసిపి ర్యాలీకి ఇచ్చిన రూట్ ఒకటైతే ... వారు వెళ్లిన రూట్ మరొకటి అని టిడిపి నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సైతం అధికార పార్టీ తరపున మాట్లాడుతున్నారంటూ టిడిపి నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. పోలీసులను టిడిపి నేతలు ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ... నల్ల జెండాలతో నినాదాలు చేస్తూ టిడిపి నాయకులు ప్రదర్శనలు చేపట్టారు.










