- కెసిఆర్‌పై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు
ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : రామగుండం ఎన్‌టిపిసిలో భాగంగా రూ.6 వేల కోట్లతో చేపట్టిన సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఎస్‌టిపిపి)ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. నిజామాబాద్ జిల్లాలో మంగళవారం పర్యటించిన ఆయన తెలంగాణలో రూ.8 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభా వేదికపై నుంచి ఎన్‌టిపిసి ప్రాజెక్టుతోపాటు మనోహరాబాద్-సిద్దిపేట రైల్వే లైన్‌ను ప్రారంభించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ ఎన్‌టిపిసితో తెలంగాణకు నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుందని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జిహెచ్‌ఎంసి ఎన్నికలకు ముందు మాతో సఖ్యతగా ఉన్న కెసిఆర్ వైఖరి ఆ తర్వాత మారిపోయిందన్నారు. బల్దియా ఎన్నికల తర్వాత కెసిఆర్ ఢిల్లీ వచ్చి నన్ను కలిశారని, మీ హయాంలో దేశం దూసుకుపోతోందని భజన చేశారని తెలిపారు. ఎన్‌డిఎలో చేరతామని, తెలంగాణలో పాలనాపగ్గాలు కెటిఆర్‌కు ఇస్తానని అన్నారని, కెటిఆర్‌ను ఆశీర్వదించండని కెసిఆర్ కోరారని వివరించారు. అయితే, ఇది రాజరికం కాదని, బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని కెసిఆర్‌కు తేల్చి చెప్పానని మోడీ తెలిపారు. తెలంగాణలో ఇంకా రాజరికం కావాలని కెసిఆర్ భావిస్తున్నారని, అందుకే తన తర్వాత తన కొడుకును సిఎం చేయాలని చూస్తున్నారని, ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు. వందల మంది యువకుల బలిదానాలతో వచ్చిన తెలంగాణలో రాష్ట్ర ఖజానా ఒకే కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. అలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు.










