ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సిఐడి విచారణకు టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సన్నిహితులు కిలారు రాజేష్ హాజరయ్యారు. సోమవారం తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో జరిగిన విచారణకు తన న్యాయవాదితో కలిసి ఆయన హాజరయ్యారు. స్కిల్ కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు కాగానే తనను కూడా అరెస్టు చేస్తారనే ఆందోళనతో రాజేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో నిధుల మళ్లింపులో తన ప్రమేయం ఉన్నట్లు ఎపిసిఐడి అడిషనల్ డిజి మీడియాకు వివరించారని హైకోర్టుకు తెలిపి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ కేసులో రాజేష్‌ను నిందితునిగా చేర్చలేదని, ఒకవేళ చేరిస్తే సెక్షన్ 41ఎ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారిస్తామని హైకోర్టుకు ఎపి సిఐడి నివేదించింది. ఇందులో భాగంగా రాజేష్‌ను విచారణకు హాజరుకావాలంటూ సిఐడి సెక్షన్ 41ఎ కింద నోటీసులు ఇవ్వడంతో సోమవారం సిట్ కార్యాలయానికి విచారణ కోసం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజేష్-లోకేష్‌కు మధ్య సంబంధాలు, స్కిల్ డెవలప్‌మెంటు కేసుకు సంబంధించి పలు అంశాలను ప్రశ్నించినట్లు తెలిసింది. ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించిన అనంతరం మంగళవారం కూడా విచారణకు హాజరు కావాల్సి వుంటుందని నోటీస్ ఇచ్చినట్లు రాజేష్ మీడియాకు వివరించారు. పరారీలో వున్నానని తనపై దుష్ప్రచారం చేశారని, వారందరినీ చట్ట ప్రకారం ఎదుర్కొంటానని అన్నారు. 25 ప్రశ్నల వరకు సిఐడి అధికారులు అడిగారని, అందులో ఎక్కువగా స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధం లేనివి అడిగారని తెలిపారు. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేక ఈ తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. న్యాయవాది సమక్షంలోనే విచారణ జరిగిందని పేర్కొన్నారు.










