ప్రజాశక్తి- యంత్రాంగం : పశ్చిమ గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం వర్షాలు కురిశాయి. ఈదురుగాలులు, వర్షాలకు చెట్లు విరిగిపడ్డాయి. వాటిలో కొన్ని చెట్లు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లపై పడడంతో విద్యుత్ సరఫరాకు, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పిడుగుపాటుకు శ్రీకాకుళం జిల్లాలో మహిళ మృతి చెందారు. ఈ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. బూర్జ మండలం లాభాం గ్రామానికి చెందిన నక్క పద్మావతి (45) ఆవును మేతకు తీసుకెళ్లారు. సమీపంలో పిడుగు పడడంతో ఆమె మృతి చెందారు. ఆవు కూడా మరణించింది. బూర్జలో వడగళ్ల వానపడింది.
పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం, కురుపాం, పాలకొండ, సీతంపేట, జియ్యమ్మవలస, వీరఘట్టం తదితర మండలాల్లో ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురిసింది. పార్వతీపురంలో టిఆర్‌ఎంఎం ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న చెట్టు కూలి విద్యుత్ వైర్లపై పడింది. దీంతో, విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కురుపాంలో రొంపల్లి లక్ష్మి ఇంటిపై చెట్టు పడింది. దీంతో, ఆమె ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. ఈదురుగాలుల తీవ్రతకు పండా వీధికి చెందిన జి.రాము పూరిల్లు పైకప్పు ఎగిరిపోయింది.
కూరాకుల వీధిలో విద్యుత్ వైర్లపై చెట్టు పడి విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో ఎక్కడికక్కడ చెట్లు విరిగి విద్యుత్తు వైర్లు, స్తంభాలపై పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఏలూరు జిల్లా ముసునూరు మండల పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులు, వర్షానికి విద్యుత్ స్తంభాలతోపాటు వృక్షాలు కూలిపోయి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. పడమర గాలుల ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు అధికంగా పెరుగుతాయని, దీంతో, సముద్రమట్టంపై ఉన్న వేడి గాలులు ఆవిరిగా మారి వర్షాలకు కారణవుతున్నా యని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, గత పది రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు ఈ వర్షాలు కొంత ఉపశమనాన్ని ఇచ్చాయి.










