వరంగల్: కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలంరేగింది. సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి మనోహర్‌ను థార్డ్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసి, దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14వ తేదీ తెల్లవారుజామున థార్డ్ ఇయర్ చదువుతున్న సాయికిరణ్ అనే విద్యార్థి బర్త్ డే సందర్భంగా సీనియర్ విద్యార్థులు కేక్ కట్ చేశారు. ఈ క్రమంలో అటువైపు నుంచి వెళ్తున్న జూనియర్ విద్యార్థి మనోహర్‌ను అడ్డుకుని వేధించి, దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సాయికిరణ్ సహా ఆరుగురిపై కేసు నమోదు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్, యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ జరుపుతోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.










