May 18,2023 21:20

మాడ్రిడ్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ నుంచి 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత, స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ వైదొలిగాడు. మల్లోర్కా అకాడమీలో గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ నాదల్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు. తాను ఎంతో ఇష్టపడి ఆడే గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఒకటైన ఫ్రెంచ్‌ ఓపెన్‌ బరిలోకి దిగాలని భావించినా.. గాయంనుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను రఫెల్‌ నాదల్‌ రికార్డుస్థాయిలో 14సార్లు చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. 2005లో తొలిసారి ఈ టోర్నీని ముద్దాడిన నాదల్‌.. 37వారాలుగా గాయాల కారణంగా ఆటకు దూరంగా ఉంటున్నాడు. గత ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ రెండోరౌండ్‌లో అమెరికాకు చెందిన మెకన్సీ మెక్‌ డొనాల్డ్‌ చేతిలో ఓటమిపాలయ్యాక మళ్లీ రాకెట్‌ పట్టలేదు.