- వాకపల్లి - పూర్వాపరాలు
విశాఖ ఏజెన్సీలోని వాకపల్లి అత్యాచార ఘటన దేశంలోనే ఒక సంచలనం. అమాయకపు ఆదివాసీ (కోందు) మహిళలను ఏమి చేసినా ప్రశ్నించరనే అహంకారంతో ఉన్న పోలీసులను బోనెక్కించిన ఘటన. ఏమీ జరగలేదని, ప్రభుత్వం, పోలీసు బాస్, దర్యాప్తు అధికారులందరూ కలిసి బుకాయింపులకు దిగినా, రికార్డులను ధ్వంసం చేసినా ప్రజా ఉద్యమం. న్యాయ పోరాటాల ముందు అవేమీ నిలబడలేకపోయాయి. తమకు అన్యాయం జరిగిందని కోర్టుకెక్కిన అమాయక మహిళలకు సరైన న్యాయం చేయలేకపోయినా వారికి అన్యాయం జరిగిందని మాత్రం న్యాయస్థానం సహా ప్రపంచం గుర్తించింది. అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చని, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని విర్రవీగే వారి అహంకారాన్ని ప్రజా సంఘాలు, మావన హక్కుల సంఘాలు చేసిన పోరాటాలకు న్యాయ పోరాటమూ కలిసి అథ:పాతాళానికి తొక్కాయి. న్యాయం ఆలస్యం కావటం న్యాయాన్ని నిరాకరించినట్లేనన్న నానుడి ఈ కేసు 16 ఏళ్ళు పట్టిన విషయాన్ని గుర్తుచేస్తుంది. నేరం చేసిన వారికి ఏ రూపంలో అయినా సహకరించేవారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనేందుకు వాకపల్లి కేసు తీర్పు ప్రత్యక్ష సాక్ష్యం.
2007 ఆగస్టు 8న పూర్వ విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ పరిధిలోని వాకపల్లి అటవీ ప్రాంతానికి చెందిన 11 మంది మహిళలు తమపై గ్రేహౌండ్స్ పోలీసులు అత్యాచారం చేశారని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. ఇది జరిగిన 12 రోజులకు అంటే.ప్రజాసంఘాలు, మానవ హక్కుల సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఆందోళనతో 20 ఆగస్టు 2007న క్రైం నెంబరు 86/2007గా ..సెక్షన్ 376 (గ్యాంగ్‌రేప్) ఎస్‌సి, ఎస్‌టి ఎట్రాసిటీ చట్టం కింద పాడేరు పోలీసుస్టేషన్లో కేసులు నమోదయ్యాయి.
దోషుల్ని శిక్షించాలని, బాధిత మహిళలను ఆదుకోవాలనీ వామపక్షాలు, వివిధ ప్రజాసంఘాలు ఉద్యమించాయి. వారిపైనా పోలీసులు నిర్బంధాన్ని ప్రయోగించారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్సీగా ఎంవిఎస్ శర్మ శాసనమండలిలో చర్చ లేవనెత్తి, వాకపల్లి విషయంలో ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టడంలో కృతకృత్యులయ్యారు.
ఈ కేసులో బాధితులకు అన్యాయం జరిగిందని న్యాయస్థానం భావించిందంటే...దానికి ప్రజా సంఘాలు, మహిళా, మానవహక్కుల సంఘాల పోరాటాలే కారణం. అవి లేకపోతే అసలు కేసు విచారణ దశకే వచ్చేది కాదని బలంగా చెప్పవచ్చు. వారే బాధితులను హైదరాబాద్‌కు, హైకోర్టుకు, మానవ హక్కుల కమిషన్ వద్దకు, ఎట్టకేలకు సుప్రీం కోర్టుకు తీసుకెళ్లారు. చివరకు కోర్టులు జోక్యం చేసుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆనందరావు అనే అధికారిని విచారణ కోసం నియమించారు. అయినా ఎటువంటి ప్రయోజనమూ లేకపోగా బాధితులు హైకోర్టుకు, మానవ హక్కుల సంఘాలకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ అధికారిని మార్చి సిబిసిఐడికి బాధ్యతలు అప్పగించింది. శివానందరెడ్డి అనే అధికారిని విచారణకు నియమించారు. ప్రాథమిక రిపోర్టులో 23 మంది పోలీసు సిబ్బందిని చేరిస్తే విచారణ అనంతరం 13 మంది నిందితులుగా కోర్టు గుర్తించింది. దీనిపై వారు కోర్టును ఆశ్రయించారు. చివరకు సుప్రీం కోర్టు సైతం విచారణ సాగించాల్సిందేనని ఆదేశించింది. విచారణ జరుగుతున్న సమయంలోనే కేసు విచారిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో హైకోర్టు స్పందించి క్రిమినల్ కేసులు విచారించే అనుభవం ఉన్న ఏడుగురు న్యాయవాదుల లిస్టును సూచించాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఏడుగురు లిస్టు పంపిన తరువాత వారిలో ముగ్గురిని షార్ట్‌లిస్టు చేసి అనంతరం రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు సుంకర రాజేంద్రప్రసాద్‌ను ఖరారు చేసింది.
బాధిత గిరిజన మహిళలకు తెలుగు రాదు. వారి భాష మనకు అర్థం కాదు. అయినా రూపాయి సంపాదన లేని పరిస్థితుల్లో న్యాయస్థానాలను నమ్మి నిలబడ్డారు. అక్కడకు వచ్చి సాక్ష్యం చెప్పారు. అంతకు ముందే వారు సాక్ష్యం చెప్పకుండా ఉండేందుకు పోలీసులు ప్రలోభపెట్టారు. భయపెట్టారు. అయినా లొంగలేదు. ఈ కేసులో వసుధ నాగరాజు అనే హైకోర్టు న్యాయవాది బాధితుల తరుపున గట్టిగా నిలబడ్డారు. పూర్తిగా సహకరించారు.
విచారణ అధికారులు సరిగా విచారణ చేయలేదని, వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టమైన నిర్ణయాన్ని కోర్టు తీసుకుంది. విచారణలో తొలి అధికారి ఆనందరావు మరణించారు. రెండో అధికారి శివానందరెడ్డిపై విచారణ జరపాలని న్యాయస్థానం ఆదేశించింది. మహిళలకు నష్టరిహారం ఇవ్వాలనీ, ఎంతివ్వాలనే విషయాన్ని నిర్థారించాలని విశాఖపట్నం లీగల్ సర్వీస్ అథారిటీకి సూచించింది. నేరస్తులకు శిక్ష పడలేదనే బాధ ఉన్నా విచారణ అధికారులపై చర్యలు తీసుకోవడమనేది ఆహ్వానించదగ్గ విషయం. రాజకీయ వ్యవస్థ, పాలనా వ్యవస్థ, మంత్రులు, పోలీసులు వాళ్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఏమవుతుందనేది ఈ కేసులో స్పష్టమైంది.

బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి : కిల్లో సురేంద్ర, ఎపి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ప్రజాశక్తి - పాడేరు టౌన్ : వాకపల్లి కేసులో కోర్టు వెలువరించిన కీలక తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు. బాధిత మహిళలకు రూ.25 లక్షలు చొప్పున నష్టపరిహారాన్ని తక్షణమే అందించాలి. కుటుంబంలో ఒకరి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. వాకపల్లి ఆదివాసీ మహిళలపై అత్యాచారం జరిగిన ఘటన వెలుగు చూసిన నుంచీ గిరిజన సంఘం ఆందోళనలు చేస్తూనే ఉంది. బాధితులకు అండగా నిలుస్తూ వచ్చింది. ఎట్టకేలకు కోర్టు తీర్పు వచ్చినా అసలు నిందితులపై శిక్ష లేకపోవడం విచారకరం. ప్రభుత్వ అసమర్థత, పోలీసులు, దర్యాప్తు అధికారుల తీరుతో ఈ కేసు నీరుగారిపోయింది. సాక్ష్యాలు తారుమారయ్యాయి. ఈ కేసు దర్యాప్తు తీరుపట్ల పలు విమర్శలు వెలువెత్తినప్పటికీ ఆనాటి ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పటికైనా కేసు దర్యాప్తు సక్రమంగా చేపట్టని, ఉద్దేశపూర్వకంగా కేసును నీరుగార్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి.
దర్యాప్తు అధికారులను, నిందితులను శిక్షించాలి : 'వాకపల్లి' బాధిత మహిళలు
ప్రజాశక్తి - పాడేరు : 'మాపై జరిగిన అత్యాచారం వల్ల చాలా అవమానపడ్డాం. ఎంతో దుఃఖించాం, విశాఖకు వెళ్ళాం.. హైదరాబాదుకు తిరిగాం. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. మేమెంతో చింతపడ్డాం. ఏళ్లు గడుస్తున్నా మాకు న్యాయం జరగలేదని చాలా బాధపడ్డాం. కోర్టును నమ్ముకున్నాం. ఇప్పుడు మాకు కోర్టు వల్లే న్యాయం జరిగింది. దీనికి మేమెంతో సంతోషిస్తున్నాం' అంటూ వాకపల్లి బాధిత మహిళలు తమ మనోగతాన్ని వ్యక్తపరిచారు. ఎన్నో ఏళ్లుగా న్యాయం కోసం తాము ఎదురుచూస్తున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం తమకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని కోరారు. తమ కేసులో సహకరించని, సరిగా దర్యాప్తు చేయని అధికారులతో పాటు నిందితులనూ శిక్షించాలని విన్నవించారు.

గిరిజన మహిళల నైతిక విజయం : లకే రాజారావు, పాడేరు మాజీ ఎమ్మెల్యే
ప్రజాశక్తి - పాడేరు టౌన్ : వాకపల్లి కేసులో గిరిజన మహిళలు నైతికంగా విజయం సాధించారు. దర్యాప్తు జరుగుతున్న తీరుపై, అధికారులపై తొలినుంచీ ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం. అప్పట్లో ఎమ్మెల్యేగా బాధిత మహిళలకు న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని పోరాటం చేసాం. సంచలనం సృష్టించిన ఈ కేసులో దర్యాప్తు అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో బాధిత మహిళలకు ఊరట లభించింది. దర్యాప్తు అధికారులు తీరు సరిగా లేకపోవడం తోనే ఆధారాలు లభించలేదు. ఉద్దేశ పూర్వకంగా కేసును నీరుగార్చిన అధికారులను విచారించి చర్యలు చేపట్టాలి. గిరిజన పిటిజి మహిళలు సుదీర్ఘకాలంగా సాహసం, సహనంతో పోరాటం చేయడం చాలా గొప్ప సంగతి. పదహారేళ్ల పాటు పోరాటం కొనసాగించి విజయం సాధించిన మహిళల గురించి ఎంత చెప్పినా తక్కువే.










